ఏపీ సంస్కృతి.. మెల్లగా తెలంగాణ‌కు పాకిందే!

ఏపీలో ఇటీవ‌ల ఒక సంస్కృతి వెలుగు చూసింది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పాల్గొనే స‌భ‌లు స‌మావేశాల‌కు ప్ర‌జ‌లు రావ‌డం లేదు. కార‌ణం ఏదైనా కావొచ్చు. ఎక్కువ స‌మ‌యం నిరీక్షించాల్సి రావ‌డం.. లేదా.. స‌రైన సౌక‌ర్యాలు లేక‌పోవ‌డం.. లేదా.. ఆరోజు ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మైన పనులు ఉండ‌డం వంటివి ఇలా..ఏవైనా కావొచ్చు. దీంతో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పాల్గొనే స‌భ‌కు జ‌నం త‌గ్గిపోతున్నారు. దీంతో ఏపీలో డ్వాక్రా సంఘాల మ‌హిళ‌ల‌ను అధికారులు ఇలాంటి స‌భ‌ల‌కు త‌ర‌లిస్తున్నారు.

ఇప్ప‌టికి అనేక సంద‌ర్భాల్లో డ్వాక్రా మ‌హిళ‌ల‌ను అధికారులు త‌ర‌లించ‌డం.. ఈ క్ర‌మంలో వారిని బెదిరించ‌డం.. వీటికి సంబంధించిన వీడియోలు.. ఆడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డం తెలిసిందే. కొన్ని సంద‌ర్భాల్లో ఇవివివాదానికి కూడా దారి తీశాయి. అయితే.. ఇప్పుడు ఈ సంస్కృతి తెలంగాణ‌కు కూడా పాకింద‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. తాజాగా .. ఒకింత ఆల‌స్యంగా వెలుగు చూసిన ఈ వ్య‌వ‌హారం రాష్ట్రంలో చ‌ర్చ‌కు దారితీస్తోంది.

రంగారెడ్డి జిల్లాలో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పాల్గొనే కలెక్టరేట్‌ ప్రారంభోత్సవానికి రాకపోతే జరిమానా కట్టాల్సి ఉంటుందని, సీఎం కేసీఆర్‌ సభకు హాజరు కాని వాళ్లకు భవిష్యత్తులో లోన్లు ఇవ్వరని బడంగ్‌పేట్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని డ్వాక్రా సంఘాల మహిళలకు వాట్సాప్‌లో సందేశాలు పంపడం వివాదాస్పదమైంది.

‘కొంగర దగ్గర కలెక్టర్‌ ఆఫీస్‌ ఓపెనింగ్‌ ఉంది. డ్వాక్రా మహిళలందరూ కేసీఆర్‌కు స్వాగతం పలకాలి. ఉద యం 11 గంటలకల్లా మునిసిపల్‌ ఆఫీసు దగ్గరికి రావాలి. రాని వారి పేర్లు నమోదు చేసుకొంటాం. వాళ్లకు భవిష్యత్తులో లోన్లు, ఎన్నికల సమయంలో డబ్బు ఇవ్వరు’ అని డ్వాక్రా మహిళలకు సందేశాలు వెళ్లాయి. అంతేకాదు.. సభకు రాలేని వాళ్లు రూ.500 ఫైన్‌ కట్టాలని మరో మెసేజ్‌ పంపారు. సమావేశానికి వెళ్లలేని కొందరు మహిళలు తమ గ్రూప్‌ లీడర్లకు ఫైన్‌ కట్టినట్లు సమాచారం. ఈ విష‌యం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. దీనిపై అధికార పార్టీ నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.