పిలిచిన‌ప్పుడు రండి: జ‌గ‌న్‌కు హైకోర్టు ఆదేశం

Jagan

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్ర‌మేయం ఉంద‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అక్ర‌మాస్తుల కేసులో.. తెలంగాణ హైకోర్టు  ఊరట ఇచ్చింది. సీబీఐ కోర్టులో జగన్ వ్యక్తిగత హాజరుకు హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. సీబీఐ కోర్టులో రోజువారీ విచార ణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తున్న‌ట్టు తెలిపింది. జగన్మోహన్ రెడ్డి రోజు వారీ విచారణకు హాజరు కావాలన్న సీబీఐ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.

తన బదులు తన తరఫు న్యాయవాది హాజరుకు అనుమతివ్వాలన్న జగన్ అభ్యర్థనకు హైకోర్టు అంగీకారం తెలిపింది. అయితే సీబీఐ కోర్టు తప్పనిసరి అని భావించినప్పుడు.. పిలిస్తే మాత్రం కోర్టుకు వెళ్లాల్సిందేన‌ని.. అప్పుడు ఈ మినహాయింపులు వ‌ర్తించ‌వ‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఉమ్మ‌డిరాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు.. అధికారాన్ని అడ్డు పెట్టుకుని.. అవినీతికి పాల్ప‌డ్డార‌ని.. ఆయా కంపెనీల నుంచి దొడ్డిదారిలో పెట్టు బ‌డులు పెట్టించుకుని అనుచిత ల‌బ్ధి పొందార‌ని.. జ‌గ‌న్‌పై కేసులు ఉన్న విష‌యం తెలిసిందే.

ఈ కేసుల విచార‌ణ‌లో భాగంగానే 2013-15 మ‌ధ్య ప్రాంతంలో జ‌గ‌న్‌ను అరెస్టు చేయ‌డం.. 16 నెల‌ల పాటు ఆయ‌న జైల్లో ఉన్న విష‌యం తెలిసిందే. త‌ర్వాత‌.. బెయిల్ ల‌బించింది. ప్ర‌స్తుతం ఏపీ సీఎంగా ఉన్న జ‌గ‌న్ బెయిల్ పై పాల‌న సాగిస్తున్న ఏకైక ముఖ్య‌మంత్రి. అయితే.. ఈ కేసుల విచార‌ణ మాత్రం హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లి కోర్టులో కొన‌సాగుతోంది. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు.. ప్ర‌తి శుక్ర‌వారం ఆయ‌న నాంప‌ల్లి కోర్టుకు హాజ‌ర‌య్యారు. దీనిని అప్ప‌ట్లో అధికార పార్టీ నేత‌లు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు.

ఇక‌, 2019లో గెలిచి… అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా ఈ కేసుల విచార‌ణ కొన‌సాగుతోంది. కానీ, ఆయ‌న త‌న‌కు బ‌దులు.. త‌న‌త‌ర‌పున న్యాయ‌వాదిని విచార‌ణ‌కు పంపుతున్నారు. దీనిపై సీబీఐ ఏడాది నుంచి పోరాడుతోంది. ఉద్దేశ పూర్వ‌కంగానే సీఎం జ‌గ‌న్ విచార‌ణ‌కు డుమ్మా కొడుతున్నార‌ని.. ఆయ‌న‌ను విచార‌ణ‌కు ర‌ప్పించేలా ఆదేశాలు ఇవ్వాల‌ని.. కోర్టును కోరుతోంది. దీనిపై కూడా నాంప‌ల్లి సీబీఐ కోర్టు విచార‌ణ జ‌రిపి.. కొన్నాళ్ల కింద‌ట‌.. సీఎం జ‌గ‌న్‌ విచార‌ణకు హాజ‌రు కావాల్సిందేన‌ని ఆదేశించింది. అయితే.. ఈ తీర్పును తెలంగాణ హైకోర్టులో జగ‌న్ స‌వాల్ చేశారు.