ఒంటరి పోరాటంతో ఏమవుతుంది?

నరేంద్ర మోడీపై కేసీయార్ పోరాటాన్ని ప్రారంభించి చాలా కాలమే అయ్యింది. మరింత వరకు ఏ ఇతర ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ తో చేతులు కలపలేదు. మోడీకి వ్యతిరేకంగా ఇద్దరు ముఖ్యమంత్రులున్నారు. మమతాబెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ మోడీని ఎప్పటికప్పుడు చాలెంజులు చేస్తూనే ఉన్నారు. వీళ్ళ స్ధాయిలో కాకున్నా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎలాగూ ఉండనే ఉన్నారు. నవీన్ పట్నాయక్ అసలు మోడీకి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడటం లేదు. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోవటం కూడా వేస్టే.

అయితే మోడీకి వ్యతిరేకంగా కేసీయార్ రెచ్చిపోతున్నా మమత కానీ లేదా కేజ్రీవాల్ కానీ ఎందుకని మద్దతు పలకటం లేదు ? బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా మోడీకి వ్యతిరేకంగా తయారైనా ఇంకా కేసీయార్, మమత, కేజ్రీవాల్ లాగా ఇంకా ఊపందుకోలేదు. అయితే ఎవరు మద్దతు పలకకపోయినా కేసీయార్ ఎంతకాలమని మోడీకి వ్యతిరేకంగా పోరాడుతారన్నదే ప్రశ్న. మోడీ వ్యతిరేకులను కలుపుకుని వెళ్ళలేకపోతున్నారు ఇదే సమయంలో ఒంటరి పోరు వల్ల ఉపయోగమూ లేదు.

షెడ్యూల్ ఎన్నికల వరకు మోడీని కేసీఆర్ టార్గెట్ చేయటమూ, కేసీయార్ ను బీజేపీ నేతలు లక్ష్యంగా చేసుకుని నోరు పారేసుకోవటం తప్ప ఎలాంటి ఉపయోగముండదు. మధ్యలో జనాలకు పిచ్చిపడుతోందంతే. రెండు పార్టీల నేతలు హద్దులు దాటేయటం వల్లే సమస్యలు పెరిగిపోతున్నాయి. ఎలాగైనా అధికారాన్ని నిలుపుకుని తీరాలని కేసీయార్ చాలా పట్టుదలతో ఉన్నారు. ఇదే సమయంలో ఎలాగైనా సరే అధికారంలోకి వచ్చి తీరాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ఇందులో భాగంగానే రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం పెరిగిపోతోంది. దీనివల్ల రాజకీయ కాలుష్యం బాగా పెరిగిపోతోంది.

మోడీ వ్యతిరేకులను కేసీయార్ కలుపుకుని వెళ్ళకపోతే ఎలాంటి ఉపయోగముండదని తెలుసుకోవాలి. అయితే కేసీయార్ తో కలవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారన్నదే ప్రశ్న. క్షేత్ర స్ధాయిలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఏ ముఖ్యమంత్రీ కేసీయార్ తో చేతులు కలపటానికి సిద్ధంగా ఉన్నట్లు కనబడటం లేదు. మరి మోడీపైన కేసీయార్ ఎంతకాలం ఒంటరి పోరాటం చేస్తారు? ఏమి సాధిస్తారు?