ఇక చంద్ర‌బాబుపై ఈగ వాల‌దు..

టీడీపీ అధినేత చంద్ర‌బాబు భ‌ద్ర‌త‌విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. ఆయ‌నపై ఈగ వాల‌కుండా చూసుకునేందుకు స‌మాయ‌త్త‌మైంది. ప్ర‌స్తుతం చంద్ర‌బాబుకు నేష‌న‌ల్ సెక్యూరిటీ గార్డ్స్‌తో భ‌ద్ర‌త క‌ల్పిస్తున్నారు. అయితే.. తాజాగా కుప్పంలో జ‌రిగిన ప‌రిణామాల‌పై చంద్ర‌బాబు కేంద్ర ప్ర‌భుత్వానికి ఫిర్యాదు చేశారు. త‌న ప‌ర్య‌ట‌న‌ను వైసీపీ నాయ‌కులు నిలువ‌రించ‌డం.. త‌న కాన్వాయ్ ల‌క్ష్యంగా.. రాళ్ల దాడి చేయ‌డం.. వంటివిష‌యాల‌ను ఆయ‌న చాలా సీరియ‌స్‌గా తీసుకున్నారు.

ఈ క్ర‌మంలో కేంద్రం నుంచి కూడా అంతే వేగంగా రియాక్ష‌న్ వ‌చ్చింది. నేష‌న‌ల్ సెక్యూరిటీ గార్డ్స్‌కు చెందిన డిప్యూటీ ఇన్‌స్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌ను కేంద్ర ప్ర‌భుత్వం హుటాహుటిన రంగంలోకి దింపింది. హైద‌రాబాద్ నుంచి వ‌చ్చిన డీఐజీ.. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ ఆఫీసులోని ప్రతి రూమ్ ను ఎన్ఎస్‌జీ బృందం తో ఆయ‌న త‌నిఖీలు చేశారు. అదేస‌మ‌యంలో స్థానికంగా ఉన్న డీఎస్పీతోనూ.. ఎన్ ఎస్‌జీ డీఐజీ భేటీ అయ్యారు.

చంద్ర‌బాబుకు సివిల్ పోలీసుల నుంచి అందుతున్న భ‌ద్ర‌త‌.. ఆయ‌న ఎక్క‌డికైనా వెళ్తే.. అనుస‌రిస్తున్న కాన్వాయ్‌లో ఉంటున్న పోలీసులు.. ఇలా.. అన్ని విష‌యాల‌ను ఆరా తీసిన‌ట్టు టీడీపీ కార్యాల‌య అధికారులు మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పోలీసుల నిర్లక్ష్యంపై చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇప్పటికే కేంద్రానికి టీడీపీ ఫిర్యాదులు చేసిన నేప‌థ్యంలో తాజా ప‌రిణామాలు.. చంద్ర‌బాబుకు.. టీడీపీ నేత‌ల‌కు ఊర‌ట‌నిస్తున్నాయి.