బీజేపీ ఎద‌గ‌డానికి.. ఏమైనా చేస్తాం

బీజేపీ జాతీయ పార్టీ. ఒక సిద్ధాంతం ప్ర‌కారం.. ప‌నిచేయాల్సిన పార్టీ. అదేసిద్ధాంతంతో ఎద‌గాల్సిన పార్టీ. 1983లో ఏర్ప‌డిన ఈపార్టీ అవే సిద్ధాంతాల పునాదుల‌పై ముందుకు సాగింది. చాలా మంది నాయ‌కులు పార్టీని ముందుకు న‌డిపించారు. అయితే.. ఎవ‌రూ ఎప్పుడూ.. పొరుగు పార్టీని త‌మ‌లో క‌లిపేసుకుని.. ముందుకు వెళ్లాల‌ని అనుకోలేదు. అస‌లు ఇది .. జాతీయ పార్టీగా.. బీజేపీకి స‌రైన విధానం కూడా కాదు. అయితే.. ఇటీవ‌ల కాలంలో బీజేపీ ఇదే పంథాను అనుస‌రిస్తోంది.

ఇత‌ర పార్టీల‌ను బ‌ల‌హీన‌ప‌రిచి.. త‌మ లో విలీనం చేసుకుని.. ప్ర‌భుత్వాల‌ను కూల‌దోస్తోంది. ఇప్పుడు.. తాజాగా ఇదే విష‌యాన్ని ఎంపీ అర్వింద్ ముసుగు తీసిన‌ట్టు వివ‌రించారు.  బీజేపీ ఎదగడానికి ఏ పార్టీనైనా చీలుస్తామని తెలంగాణలోని నిజామాబాద్ ఎంపీ అన్నారు. బెజవాడ దుర్గమ్మను ఆయన దర్శించుకు న్నారు. అనంత‌రం .. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ మేలి ముసుగును తీసేశారు.

రాజకీయాల్లో ఒకపార్టీ ఎదగడానికి మరో పార్టీని చీల్చటంలో తప్పులేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ అవుతుందని.. మునుగోడులో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2023 ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఏపీలో తమ పార్టీ బలపడడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని ఏపీలోనూ అధికారంలోకి వస్తామన్నారు.

విజయవాడతో తనకున్న అనుబంధాన్ని అరవింద్ గుర్తు చేసుకున్నారు. ఈడీ, సీబీఐలను బీజేపీ పావులుగా వాడుకుంటుందా ? అన్న‌ ప్రశ్న‌కు.. అదేం లేదని సమాధానమిచ్చారు. బీజేపీ అధినాయకత్వం ఏం చెబితే తాము అది పాటిస్తామన్నారు. ప్రభుత్వ సంస్థలను బీజేపీ అమ్మటాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలన్న మరో ప్రశ్నకు.. ప్రాంతీయ పార్టీలు చేసినవే తాము చేస్తున్నామని అరవింద్ బదులిచ్చారు. బీజేపీ ఎదగడానికి ఏ పార్టీనైనా చీలుస్తామని మ‌రోసారి చెప్పుకొచ్చారు. ఎంపీ వ్యాఖ్య‌ల‌తో.. అంద‌రూ ఔరా అని నోరెళ్ల‌బెట్ట‌క త‌ప్ప‌లేదు.