జిల్లాల స్థాయిలో వైసీపీ ఇప్పటికే కష్టాల్లో ఉంది. అనేక జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని.. నాయకుల మధ్య సమన్వయం కొరవడిందని.. పార్టీ అధిష్టానం ఇప్పటికే తల్లడిల్లుతోంది. అయినప్పటికీ.. నాయకులు మాత్రం ఎక్కడా తగ్గేదేలే అంటున్నారు. ఎవరికి వారు తమ ఇష్టం వచ్చిన విధానంలో ముందుకుసాగుతున్నారు. తాజాగాఅనకాపల్లి జిల్లాలో వైసీపీ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. యలమంచిలి ఎమ్మెల్యేగా కన్నబాబు రాజుకు జిల్లాకు చెందిన యువ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వర్గం పొగపెడుతోందనే వాదన కొన్నాళ్లుగా వినిపిస్తోంది.
కన్నబాబు రాజు చాలా సీనియర్. 2004, 2009లో కాంగ్రెస్ తరపున ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టీడీపీ నేత పంచకర్ల రమేష్‌బాబు చేతిలో ఓటమి చెందారు. ఆ తర్వాత టీడీపీలో చేరి చాలా కాలం ఆ పార్టీలోనే ఉన్నారు. 2019 ఎన్నికల ముందు కన్నబాబు రాజు.. వైసీపీలో చేరి యలమంచిలి నుంచి గెలుపొందారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ప్రస్తుతం ఆయనకు వ్యతిరేకంగా అచ్యుతాపురం నేతలు బహిరంగంగానే విమర్శలకు దిగడం హాట్‌టాపిక్‌గా మారింది. అంతేకాదు సమస్యలు పట్టించుకోవడంలేదని.. సర్పంచులు, ఎంపీటీసీలు మీడియా ముందుకు రావడం కలకలం రేపింది.
యలమంచిలిలోని రాంబిల్లితోపాటు మరికొన్ని ప్రాంతాల్లో అక్రమ గ్రావెల్ తవ్వకాలకు ఎమ్మెల్యే సహకరిస్తున్నారంటూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఆరోపణలు, విమర్శలు వెనక అనకాపల్లి ఎమ్మెల్యే, మంత్రి అమర్‌నాథ్ వర్గం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యకాలంలో చాలా మంది యలమంచిలి నేతలతో మంత్రి టచ్‌లో ఉన్నారట. పైగా సమస్యలు, ఇబ్బందులు ఉంటే చెప్పాలంటూ అప్పుడప్పుడు మంత్రి పర్యటనలు చేస్తున్నారట. అంతేకాదు.. మంత్రి అమర్‌నాథ్.. యలమంచిలి సీటు ఆశిస్తున్నారట.
ఈ నియోజకవర్గంలో కాపు ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండటం, గవర కార్పొరేషన్ చైర్మన్ ఇదే ప్రాంతానికి చెందినవారు కావడంతోపాటు.. ఆయన.. అమర్‌నాథ్‌కు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారట. కాని సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబు రాజు మాత్రం గుర్రుగా ఉన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న యలమంచిలి సీటు మంత్రి అమర్నాథ్ కు ఎలా ఇస్తారంటూ కన్నబాబురాజు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. మొత్తంగా ప్రస్తుతానికి కోల్డ్‌గా ఉన్న అమర్‌నాథ్-కన్నబాబు వార్ వచ్చే ఎన్నికల నాటికి ఎలాంటి హీట్ పుట్టిస్తుందని వైసీపీలోనే ఒక వచ్చ చర్చించుకుంటుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates