బీజేపీ అగ్రనాయకత్వం నేతలందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందా ? గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ సస్పెన్షన్ తర్వాత అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాజాసింగ్ ను పార్టీ సస్పెండ్ చేస్తుందని ఎవరు అనుకోలేదు. సంవత్సరాల తరబడి హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో బీజేపీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఎంఎల్ఏ మాత్రమే అనేట్లుగా ఉండేది. 2018 ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో పోటీ చేసిన బీజేపీ గెలిచింది కేవలం గోషామహల్ నియోజకవర్గంలో మాత్రమే.
నియోజకవర్గంలో ఎంఎల్ఏకి అంతటి పట్టుంది. ఎంఐఎం ప్రాబల్యమున్న పాతబస్తీలో రాజాసింగ్ బీజేపీ తరపున గెలవటమంటే మామూలు విషయం కాదు. అంతటి బలమైన నేతనే పార్టీ సస్పెండ్ చేయటం ఆశ్చర్యంగానే ఉంది. కారణం ఏమిటంటే ఎంఎల్ఏ హద్దుదాటమే అని అర్ధమవుతోంది. మహ్మద్ ప్రవక్తపై ఎంఎల్ఏ నోటికొచ్చినట్లు మాట్లాడి ఒక వీడియో రిలీజ్ చేశారు. దాంతో ఒక్కసారిగా ముస్లింల్లో అలజడి మొదలైపోయింది. దేశంలోనే అనేక రాష్ట్రాల్లో ఎంఎల్ఏపై చాలా కేసులు నమోదయ్యాయి.
పరిస్ధితిని గమనించిన పార్టీ అధిష్టానం సమస్య పెద్దదికాకుండా వెంటనే షోకాజ్ నోటీసిచ్చి ఎంఎల్ఏని సస్పెండ్ చేసింది. అసలు పార్టీనుండి ఎందుకు బహిష్కరించకూడదో చెప్పమంటూ సంజాయిషీ అడిగింది. పార్టీ వైఖరి చూస్తుంటే హద్దుదాటిన నేతలు ఎవరైనా కానీ ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చినట్లయ్యింది. చాలామంది నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. చాలామంది నేతలు మాట్లాడే మాటలు, చేసే కామెంట్లు జనాల్లో అనవసరంగా ఉద్రిక్తతలు రేకెత్తించేట్లుగానే ఉంటున్నాయి. అయితే రాజాసింగ్ మాత్రం అన్నీ హద్దులను దాటేశారు.
ఇప్పటికే నూపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్ధించు కోలేక ఇప్పటికే జాతీయ నాయకత్వం నానా అవస్తలు పడుతోంది. నూపూర్ వివాదం ఇంకా చల్లారక ముందే అవే వ్యాఖ్యలను రాజాసింగ్ కూడా కెలకటంతో పార్టీకి పెద్ద సమస్యగా మారిపోయింది. ఇపుడు మళ్ళీ సమస్య పెద్దది కాకుండా నూపూర్ ను సస్పెండ్ చేసినట్లే రాజాసింగ్ ను కూడా తక్షణమే సస్పెండ్ చేసి వివాదాన్ని సద్దుమణిగే ప్రయత్నం చేస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates