ఈ ఎంపీ సీట్లలో మార్పులు తప్పదా?

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

వచ్చే ఎన్నికల్లో 25కి 25 పార్లమెంటు సీట్లను గెలుచుకునే ఉద్దేశ్యంతో జగన్మోహన్ రెడ్డి పెద్ద వ్యూహాలే రచిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ కారణాలతో సుమారు 12 మంది ఎంపీలను మార్చేయాలని డిసైడ్ అయ్యారట. వ్యక్తిగతంగా ఆరోపణలను ఎదుర్కొంటున్న వారు, జనాలు, క్యాడర్ తో సరైన సంబంధాలు మైన్ టైన్ చేయని తదితరాలను కారణాలుగా చూపించి ఎంపీలను మార్చేయాలని జగన్ డిసైడ్ అయ్యారట. వీరిలో కొందరు ఎంపీలను ఎంఎల్ఏలుగా పోటీ చేయించబోతున్నారట.

ఇదే సమయంలో కొందరు ఎంఎల్ఏలను ఎంపీలుగా పోటీచేయించాలని కూడా జగన్ అనుకున్నారట. పార్టీవర్గాల సమాచారం ప్రకారం హిందుపురం, అనంతపురం, నెల్లూరు, బాపట్ల, ఏలూరు, నరసాపురం, అమలాపురం, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం ఎంపీ స్ధానాల్లో కొత్త అభ్యర్ధులుంటారు. హిందుపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పై వ్యక్తిగతంగా ఆరోపణలున్నాయి. వైజాగ్, బాపట్ల ఎంపీలు అనేక వివాదాల్లో ఉన్నారు. నరసాపురం ఎంపీ వ్యవహారశైలి అందరికీ తెలిసిందే.

అనకాపల్లి, విజయనగరం, అనంతపురం, ఏలూరు ఎంపీలు ఎంఎల్ఏలుగా పోటీచేయాలని అనుకుంటున్నారట. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కూడా తాడికొండ ఎంఎల్ఏగా పోటీచేయాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. విజయవాడ, శ్రీకాకుళం సమన్వయకర్తల స్ధానంలో కొత్తవారిని నియమించబోతున్నారు. అమలాపురం ఎంపీ మీద కూడా బాగా అసంతృప్తి పెరిగిపోతున్నట్లు జగన్ దృష్టికి వచ్చినందట. ఇలా అనేక కారణాలతో 12 మంది ఎంపీలను మార్చబోతున్నారన్నది సమాచారం.

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం రెగ్యులర్ గా సర్వేలు చేస్తోంది. ఆ రిపోర్టుల ఆధారంగా ఫీడ్ బ్యాక్ చూసుకుని ఎంపీ అభ్యర్థులను రెడీ చేయబోతున్నారు. ఇప్పటికే జగన్ కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయాలను చూసుకున్నా బయటకు అయితే ఎవరి పేర్లు వినపడటం లేదు. కొందరు ఎంపీలను మార్చేస్తే మంచి రిజల్ట్ వస్తుందని ప్రశాంత్ కిషోర్ బృందం స్పష్టమైన రిపోర్టిచ్చినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తే కేంద్రంలో తిరుగుండదని జగన్ భావిస్తున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.