పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు లేదా ఆరోపణలే విచిత్రంగా ఉన్నాయి. తనపార్టీలో కోవర్టులున్నారని పవన్ మీడియా సమావేశంలో చెప్పారు. కోవర్టులంటే ఎవరు ? కోవర్టుల లక్ష్యమేంటి ? ఒకపార్టీలో ఉంటు ప్రత్యర్ధిపార్టీల లబ్దికోసం పనిచేసేవారిని కోవర్టులంటారు. మరి జనసేనలో కూడా కోవర్టులున్నారంటే వాళ్ళు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్లు ? పవన్ ఉద్దేశ్యంలో జనసేనకు మిత్రపక్షం బీజేపీ తప్ప మిగిలిన అన్నీపార్టీలూ ప్రతిపక్షాలే.
వైసీపీ ఎలాగూ పవన్ కు పూర్తి శతృపక్షమే. ఇక టీడీపీ శతృపక్షం కాకపోయినా మిత్రపక్షమైతే కాదు కాబట్టి ప్రతిపక్షమే. కాంగ్రెస్, వామపక్షాల లబ్దికోసం పనిచేసేవాళ్ళు ఉంటారని ఎవరు అనుకోవటంలేదు. కాబట్టి మిగిలింది వైసీపీ, టీడీపీ మాత్రమే. ఈ రెండుపార్టీల లబ్దికోసం జనసేనలో ఉంటు పనిచేస్తున్న కోవర్టులెవరో పవన్ చెప్పాలి. కోవర్టులున్నారని అన్నారంటే వాళ్ళెవరో కూడా ఈపాటికే పవన్ గుర్తించుండాలి.
కోవర్టులను గుర్తించినపుడు డైరెక్టుగా వాళ్ళ పేర్లు చెప్పి పార్టీలో నుండి బయటకు పంపేయకుండా వార్నింగ్ ఇవ్వటంతో సరిపెట్టుకోవటం ఏమిటి ? 2019 ఎన్నికల్లో కూడా కోవర్టుల వల్లే పార్టీకి నష్టం జరిగిందని చెప్పారు. అంటే అప్పటినుండి ఇప్పటివరకు కోవర్టులపై పవన్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని అర్ధమవుతోంది. మరి ఇపుడు కూడా కోవర్టులపై యాక్షన్ తీసుకోకపోతే ఇంకెప్పుడు తీసుకుంటారు ? పైగా కోవర్టులందరు బయటకు వెళ్ళిపొమ్మని వారికి విజ్ఞప్తి లాంటి హెచ్చరికలు దేనికి.
ఎవరైనా తాము కోవర్టులమని అంగీకరించి వాళ్ళంతట వాళ్ళుగా పార్టీలో నుండి బయటకు వెళ్ళిపోతారా ? ఏమిటో పవన్ మాటలు, చేష్టలంతా చాలా విచిత్రంగా ఉంటాయి. ఒకరోజు మాట్లాడేదానికి మరో రోజు మాటలకు ఏమాత్రం సంబంధం ఉండదు. ఏదేమైనా కోవర్టుల వల్ల పార్టీకి నష్టం జరిగిందన్నపుడు ఎన్ని నియోజకవర్గాల్లో నష్టం జరిగిందో లెక్కలు కట్టారా అన్నది తెలీదు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల రక్షించటమే ధ్యేయంగా పవన్ పనిచేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎప్పటినుండో చేస్తున్న ఆరోపణలు అందరికీ తెలిసిందే.