రాజకీయాల్లో ఎవరూ ఎవరినీ ఊరికే కలవరు. ఇపుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా-జూనియర్ ఎన్టీయార్ మధ్య భేటీ ఇందుకే ఆసక్తిగా మారింది. ఆదివారం రాత్రి ఒక హోటల్లో వీళ్ళిద్దరు సుమారు 45 నిముషాలు విందు సందర్భంగా భేటీ అయ్యారు. వీళ్ళతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణా పార్టీ చీఫ్ బండి సంజయ్ కూడా ఉన్నారు. అయితే భోజనం అయిపోయిన తర్వాత అమిత్, జూనియర్ 20 నిముషాలు ఏకాంతంగా మాట్లాడుకున్నారు.
ఆ 20 నిముషాల్లో ఏం మాట్లాడుకున్నారు ? అన్నదానిపైనే అందరిలోనూ ఉత్కంఠ పెరిగిపోతోంది. బహుశా వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ప్రకటించమనో లేదా పార్టీ తరపున ప్రచారం చేయమనో జూనియర్ ను అమిత్ అడిగుంటారనేది అందరూ అనుకుంటున్నమాట. పై రెండు కాకపోతే జూనియర్ ను అమిత్ కలవాల్సిన అవసరం లేదు. త్రిబుల్ ఆర్ సినిమాలో జూనియర్ నటనను అభినందించేందుకే అమిత్ భేటీ అయ్యారని చెప్పటం ఉత్త సొల్లని అందరికీ తెలుసు.
భేటీ ఇద్దరు మధ్య మాత్రమే జరిగింది కాబట్టి ఏమైనా చెబితే ఈ ఇద్దరే చెప్పాలి. అయితే తమ మధ్య ఏం జరిగిందనే విషయాన్ని ఈ ఇద్దరూ బయటకు చెప్పరు. కాబట్టి మూడో వ్యక్తికి తెలిసే అవకాశం లేదు. కాకపోతే ఓ రెండు రోజులు ఆగితే అప్పుడు విషయాలు బయటకు వచ్చే అవకాశముంది. ఎలాగంటే తమ భేటీ ఉద్దేశ్యం జూనియర్ ఎవరైనా సన్నిహితులతో పంచుకునే అవకాశముంది.
అంటే విషయం ఏదైనా ఉంటే అది జూనియర్ వైపునుండి మాత్రమే బయటకు వచ్చేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. జూనియర్ భేటీలో ఏం జరిగిందనే విషయాన్ని నరేంద్ర మోడీకి కచ్చితంగా అమిత్ షా బ్రీఫింగ్ ఇస్తారు. ఎందుకంటే మోడీ ఆదేశాలు లేనిదే షా ఏమిచేయరని అందరికీ తెలుసు. మోడీ నుండి ఏ విషయమూ ఎలాగూ బయటకు రాదు. కాబట్టి ఒక రెండు రోజులు ఆగితే ఏదో రూపంలో విషయం బయటకు వచ్చే అవకాశముంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates