ఏపీ సీఎం జగన్ అనూహ్యంగా ఢిల్లీకి వెళ్లారు. ఆయన నేరుగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. దాదాపు అరగంటకు పైగానే.. ప్రధాని.. జగన్‌కు సమయం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏం చర్చించుకు న్నారనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం కేంద్రం ఎలాంటి సంచలన నిర్ణయాలు కూడా లేవు. పైగా రాష్ట్ర పతిఉప రాష్ట్రపతి ఎన్నికలు కూడా ముగిసిపోయాయి. ఈ క్రమంలో జగన్ అవసరం కేంద్రానికి పెద్దగా లేదు. ఇక, జగన్‌కు మాత్రం చాలానే అవసరాలు ఉన్నాయి.
ఇటు రాజకీయంగా.. అటు పాలనాపరంగా..జగన్‌కు కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అవసరం. ఈ క్రమంలోనే జగన్ పర్యటనకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఇక, ఈ పర్యటనకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన వివరణ మేరకు.. ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయన.. 1-జన్‌పథ్‌లో బస చేశారు. పోలవరం అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు సర్కారు వర్గాలు తెలిపాయి. ప్రాజెక్టు పెండింగు బిల్లులు మంజూరు చేయాలని కోరడంతో పాటు, నిర్వాసితులకు పునరావాస కల్పనపై ప్రధానితో సీఎం చర్చిస్తారని తెలిపాయి.
అదేసమయంలో రాష్ట్రంలో ఇళ్లు నిర్మిస్తున్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర సాయాన్ని సీఎం కోరనున్నారని చెప్పాయి. నూతన వైద్య కళాశాలలకు అనుమతులతో పాటు, కేంద్రం నుంచి ఆర్థిక సాయాన్ని కోరే అవకాశం ఉందని సీఎంఓ వర్గాలు తెలిపాయి. వీటితో పాటు విభజన చట్టంలోని హామీలపైనా మరోసారి విజ్ఞప్తి చేస్తారని వెల్లడించాయి. నూతనంగా ఎన్నికైన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌లను కూడా ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా కలవనున్నట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. పలువురు కేంద్రమంత్రులను కూడా సీఎం కలిసే అవకాశం ఉందని వెల్లడించాయి.
అయితే.. సర్కారు చెబుతున్న సమాచారం నిజమే అయితే..ఇది కొత్తేమీ కాదు.. ఆయా సమస్యలు జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఉన్నాయి. కానీ..ఇప్పటికిప్పుడు ఇంత హడావుడిగా వెళ్లడం మాత్రం ఆసక్తిగా మారింది. దీని వెనుక.. మారుతున్న రాజకీయాలు.. సీబీఐ దర్యాప్తులు.. వచ్చే నెలలో సీబీఐ విచారణ వంటివి ఉన్నాయనేది.. రాజకీయ విశ్లేషకుల అంచనా. ఏదేమైనా.. ఈ అనూహ్య పర్యటన జగన్‌కు మేలు చేస్తుందా? లేదా? అనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates