బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఏపీలో నివ్వెర పోయేలా రాజకీయాలు మారతాయని.. అన్నారు. తాజాగా ఆయన ఏపీలోని జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఏపీలో జగన్‌ను గద్దె దింపే సత్తా ఒక్క బీజేపీకే ఉందన్నారు. జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, త్వరలో అందరూ నివ్వెరపోయేలా పరిణామాలు ఉంటాయని తెలిపారు. విగ్రహాలు, రథాలు ధ్వంసంపై బీజేపీ పోరాటంతో ప్రభుత్వం దిగివచ్చిందన్నారు.
రాయలసీమ యాత్ర చేసి ప్రాజెక్టుల పనులు చేపడతామని పేర్కొన్నారు. ప్రధాని మోడీ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తు న్నారని, రాష్ట్రాభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అదేసమయంలో రాజకీయంగా సోము సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపే సత్తా ఉన్న పార్టీ బీజేపీనే అని సోము వీర్రాజు అన్నారు. జగన్ భయపడేది ఒక్క నరేంద్ర మోడీకి మాత్రమేనని తెలిపారు. సీఎం జగన్ తనను తాను పులిగా అభివర్ణించుకున్నారని ఎద్దేవా చేశారు.
ఎన్నికల ముందు జగన్ అనేక రకాల హామీలు గుప్పించి ప్రజలను మోసం చేశారన్నారు. రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను మోసం చేశారని మండిపడ్డారు. మూడున్నరేళ్లలో యువతకు ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. వాలంటీర్ల పేరుతో వైసీపీ శ్రేణులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయని.. అవి ప్రజలు నివ్వెర పోయేలా ఉంటాయని సోము వ్యాఖ్యానించారు. త్వరలోనే రాయలసీమలో యాత్ర చేపడతామని సోము చెప్పారు. ఈ మేరకు విజయవాడలో జరిగిన యువ సంఘర్షణ యాత్ర ముగింపు సమావేశంలో సోము మాట్లాడారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates