వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు అడ్డుక‌ట్ట వేయాలి: ప‌వ‌న్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ నోట ఇప్ప‌టి వ‌ర‌కు రాని కొత్త వ్యాఖ్య ఒక‌టి వ‌చ్చింది. ఏపీ రాజ‌కీయాల్లో వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు అడ్డుక‌ట్ట వేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న అన్నారు. అంతేకాదు.. అన్న జ‌గ‌న్‌.. త‌న‌కు అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని.. చెల్లెలు మ‌రో రాష్ట్రంలో పార్టీ పెట్టారే త‌ప్ప‌.. త‌మ ప్రాంతం ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను మాత్రం విస్మ‌రించార‌ని మండిప‌డ్డారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌గా మారాయి.

పద్యం పుట్టిన రాయలసీమ నేలలో మద్యం ప్రవహిస్తోందని జనసేన అధినేత పవన్ మండిపడ్డారు. వైఎస్సార్ జిల్లా సిద్ధవటం కౌలు రైతు భరోసా బహిరంగ సభలో పాల్గొన్న పవన్ బాధిత కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. అనంతరం ఆయ‌న మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కౌలు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. కౌలు రైతులకు కనీసం గుర్తింపు కార్డులు కూడా ఇవ్వటం లేదన్నారు. జనసేనను ఒక్కసారి నమ్మి ఆదరిస్తే ఎవరూ చేయని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. అంతేకాదు.. ప్ర‌తి ఒక్క‌రి త‌ల‌రాత‌లు మారుస్తాన‌ని చెప్పారు.

కులమతాలపై రాజకీయాలు చేస్తే దేశం విచ్ఛిన్నం అవుతుందని జనసేన అధినేత పవన్‌ అన్నారు. తానెప్పుడూ కులమతాల గురించి ఆలోచించనని చెప్పారు. మన దేశ సామాజిక మూల లక్షణం కులమని వ్యాఖ్యనించారు. మూడేళ్లలో ఉమ్మడి కడప జిల్లాలో 173 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. వారి కుటుంబాలకు లక్ష చొప్పున మెుత్తం కోటి 73 లక్షలు అందజేశాన‌ని చెప్పారు. ఇంటింటికీ చీప్ లిక్కర్ వచ్చిందని ఇక్కడి యువత చెబుతున్నారన్నారు. కౌలురైతులకు సరిగా గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదని మండిపడ్డారు.

ఉపాధి లేకుంటే చదువుకున్న యువత ఏం చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎవరి కాళ్లపై వారు నిలబడేలా ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. తానెప్పుడూ వ్యక్తులపై పోరాటం చేయనని.. భావాలపైనే తన పోరాటం ఉంటుందన్నారు. తానెప్పుడూ పదవి కోరుకోలేదని సమాజంలో మార్పును మాత్రమే కోరుకున్నట్లు ప‌వ‌న్‌ వెల్లడించారు.

“కులమతాలపై రాజకీయాలు చేస్తే దేశం విచ్ఛిన్నం అవుతుంది. వారసత్వ రాజకీయాలకు కొంతైనా అడ్డుకట్ట వేయాలి. అన్న పట్టించుకోలేదని చెల్లెలు మరో పార్టీ పెట్టారు. రాయలసీమలోని మాదిగ, మాల కులాల గురించి ఆలోచించారా? బోయ, కురబ, పద్మశాలి, బలిజల గురించి ఆలోచించారా?. వెనుకబడిన కులాల గురించే ఎప్పుడూ ఆలోచిస్తా. రాయలసీమలోని రెడ్డి, క్షత్రియ కులాల్లోనూ పేదలున్నారు. కులం, మతం, ప్రాంతం దాటి వచ్చిన మనిషిని నేను. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరిగితే ఇక్కడ యూరియా ధర పెరిగింది. పెద్ద కులాలు ఘర్షణ పడితే సమాజంలో అనేక ఇబ్బందులు వస్తాయి“ అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

రెడ్డి పాల‌న‌లో రెడ్ల‌కు క‌న్నీళ్లే

సమాజం ఎప్పుడూ ఒకేలా ఉండకూడదని మార్పు రావాలని పవన్ అన్నారు. రెడ్డి, కమ్మ కులాలతోపాటు మిగతా కులాలకూ సాధికారత రావాలన్నారు. రాజకీయాల వెనుక ఉన్న కష్టనష్టాలు తనకు తెలుసునన్నారు. జ‌గ‌న్ రెడ్డి ప్రభుత్వం పనుల వల్ల రెడ్డి కులానికీ నష్టం జరుగుతోందని, చాలా మంది రెడ్డి నేత‌లు క‌న్నీరు పెట్టుకుంటున్నార‌ని చెప్పారు. సొంత బాబాయిని చంపినవారినీ ఇంకా ఎందుకు పట్టుకోలేదని పవన్‌ నిలదీశారు. సుగాలి ప్రీతి ఘటన కేసు నిందితులను ఇంకా పట్టుకోలేద న్నారు. సీఎంగా ఉన్న మీకు.. రాష్ట్ర పోలీసులపైనే నమ్మకం లేదా అని ప్రశ్నించారు.

త‌లెత్తుకునేలా చేస్తాం..

“రాయలసీమ నుంచి అనేకమంది సీఎంలు వచ్చినా ఇక్కడ మార్పు రాలేదు. ఇక్కడి నేతల్లో ఆధిపత్య ధోరణి బాగా పెరిగింది. తమ ముందు ప్రతి ఒక్కరూ చేతులు కట్టుకోవాలనేది వారి ఉద్దేశం. ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గ్రాంట్‌ ఇవ్వడం లేదు? పోలవరం, కేసీ కెనాల్‌, ఉక్కు పరిశ్రమకు నిధులు ఎందుకు అడగరు? కేసులున్న వారు దిల్లీలో గట్టిగా అడగలేరు. ఒక్కసారి జనసేనను నమ్మి ఆదరించండి. ఎవ్వరూ చేయని విధంగా రాయలసీమను అభివృద్ధి చేస్తా. మార్పు కోసమే మీ ముందు జనసేన నిలబడింది. మేం అధికారంలోకి వస్తే వ్యవస్థలను బలోపేతం చేస్తాం. రాయలసీమలోని వెనుకబడిన వారంతా తలెత్తుకునేలా చేస్తాం“ అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.