చివరకు రాములమ్మ కూడా పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. సినీ సెలబ్రిటీల హోదాలో రాజకీయపార్టీల్లోకి ఎంటరైన వారు ఎక్కడున్నా ఏదోకారణంతో అసంతృప్తిగానే ఉంటారేమో. నిజానికి వీళ్ళవల్ల పార్టీకి పెద్దగా ఉపయోగాలేవీ ఉండవు. కానీ తమవల్లే పార్టీకి ప్రజాధరణ పెరుగుతోందని, జనాలంతా తమకోసమే వస్తున్నారనే భ్రమల్లో ఉండటంవల్లే సమస్యలు పెరిగిపోతున్నాయి. ఏపార్టీలో ఏ సెలబ్రిటీ ఉన్నా వాళ్ళదే ఇదే సమస్యగా తయారైంది.
బీజేపీ నేత రాములమ్మ అలియాస్ విజయశాంతిది కూడా ఇదే వరసలాగుంది. తన సేవలను పార్టీ సరిగా ఉపయోగించుకోవటంలేదన్నది ఆమె ఆరోపణలు. తనను పార్టీ కార్యక్రమాలకు దూరంపెట్టేస్తున్నారట. ఎందుకంటే తనంటే కొందరు అభద్రతగా ఫీలవుతున్నట్లు ఆమె చెప్పారు. విజయశాంతిని చూసి అభద్రతగా ఫీలయ్యేవాళ్ళు ఎవరున్నారో అర్ధంకావటంలేదు. విజయశాంతి తప్ప మిగిలిన నేతలంతా సంవత్సరాల నుండి పార్టీలో పనిచేస్తున్నారు.
ఫైర్ బ్రాండ్ అయిన తనను బండిసంజయ్, లక్ష్మణ్ ఎందుకు పక్కనపెట్టారో చెప్పాలని మీడియా ముందే డిమాండ్ చేశారు. నిజానికి ఫైర్ బ్రాండ్ ఇమేజనేది సినిమాల్లో మాత్రమే ఉంటుందని తెలీదేమో. సినిమాల్లో నటించినట్లే బయటరాజకీయాల్లో కూడా చేయాలంటే సాధ్యంకాదు. ఇప్పటికి ఈ ఫైర్ బ్రాండ్ మూడు పార్టీలు మారారు. ముందు తల్లి తెలంగాణా అనేపార్టీ పెట్టుకున్నారు. అది వర్కవుట్ కాకపోవటంతో టీఆర్ఎస్ లో చేరారు. తర్వాత కేసీయార్ తో విభేదించి కాంగ్రెస్ లో చేరారు. అక్కడా కుదరకపోయేసరికి బీజేపీలో చేరారు.
బహుశా ఏ పార్టీలో ఉన్నా ఆమె ఇమేజే ఆమెకు చేటు తెస్తున్నదేమో. తనను తాను చాలా గొప్పగా భావిస్తుండటమే ఆమెలోని మైనస్ లాగుంది. తనను బహిరంగ సభల్లో మాట్లాడనీయటంలేదని, తాను ఎక్కడినుండి పోటీచేయాలో కూడా తనకు తెలీటంలేదని తనలోని తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. తనలోని సీనియర్లను కలుపుకుని వెళ్ళకపోతే ఇక బీజేపీ ముందుకేమి వెళుతుందని ప్రశ్నించటమే విచిత్రంగా ఉంది. అంటే సెలబ్రిటీలు తమను తాను చాలా ఎక్కువగా ఊహించుకోవటంతోనే అసలైన సమస్యలు వచ్చేస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates