ఏపీ సీఎం జగన్ అంతర్మథనం చెందుతున్నారా? రాష్ట్రంలో ఆయన అనుకుంటున్నట్టుగా.. ఏమీ జరగడం లేదా? ప్రతి విషయంలోనూ జగన్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీలోని కీలక నాయకులు. ముఖ్యంగా గత మేనిఫెస్టో కమిటీలో ఉన్న గుంటూరుకు చెందిన సీనియర్ నాయకుడు ఒకరు ఈ విషయాన్ని బాహాటంగానే చెబుతున్నారు. “మేనిఫెస్టోలో ఉన్నవన్నీ.. అమలు చేస్తున్నాం. కానీ.. ప్రజలు ఇంకా ఏదో కోరుకుంటున్నారు. దీనిని రీచ్ కాలేక పోతున్నాం. ఇది వాస్తవం“ అని ఆయన ఆఫ్ ది రికార్డుగా మీడియా మిత్రుల ముందు వ్యాఖ్యానించారు.
వాస్తవానికి 2019 ఎన్నికలకు ముందు మేనిఫెస్టోను ప్రకటించిన జగన్.. దానిలో అనేక పథకాలను ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను సంతృప్తి పరిచేందుకు తాను ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆయన మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ అంటూ.. పదే పదే చెబుతున్నారు. అంతేకాదు.. ఈ క్రమంలో గత టీడీపీ ప్రభుత్వం మేనిఫెస్టోను దాచేసిందని కూడా విమర్శల రాళ్లు రువుతున్నారు. అయితే.. ఇప్పుడు ఇదే మేనిఫెస్టో.. ప్రభుత్వానికి గుదిబండగా మారిందని ఆయన భావిస్తున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఆదిలో అందరికీ అన్ని పథకాలను అందించిన ప్రభుత్వం తర్వాత తర్వాత.. ఆర్థిక భారం పెరిగిపోవడం .. అప్పులు పుట్టకపోవడం.. పుట్టినా.. అరకొరగా అందడంతో ఈ మేనిఫెస్టోను కొందరికే పరిమితం చేయాల్సి వచ్చింది. దీంతో లబ్ధి దారుల సంఖ్యను ఎడా పెడా కోతపెట్టారు. దీంతో ప్రజల్లోనూ ప్రభుత్వంపై విశ్వసనీయత తగ్గిపోయిందనే విషయం ప్రభుత్వానికి వెల్లడైంది. మరోవైపు.. ఉద్యోగులను ఎంత వారించినా.. వారికి ఎన్నికల సమయంలో ఇచ్చిన పీఆర్సీ.. సీపీఎస్ రద్దు వంటి హామీలను పదే పదే ప్రస్తావిస్తుండడం జగన్ కు మరింత తలనొప్పిగా మారింది.
వీటిని కాదనలేని పరిస్థితి.. అలాగని చేయలేని దుస్థితిలో సర్కారు అడకత్తెరలో నిలబడిపోయింది. ఈ పరిణామాలు సర్కారుకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయనేది వాస్తవం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏం చేయాలి? ఇన్ని కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నామనే అపప్రదను మూటగట్టుకుంటున్నా.. ప్రజల్లో సానుభూతి నానాటికీ.. తగ్గిపోతుండడం పట్ల.. సీఎం ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఇదే పద్ధతి ఇంకా కొనసాగితే.. ఎన్నికల సమయానికి ఇబ్బందులు తప్పవని గట్టిగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చలు కూడా ఫలించలేదు. దీంతో ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఏదో ఒక మార్పు దిశగా అడుగులు వేయడం ఖాయమని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates