ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలకమైన ఎస్సీ నియోజకవర్గం.. పైగా టీడీపీకి కంచుకోట వంటి.. చింతలపూడి నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య అసంతృప్తి సెగలు రేగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే ఎలీజాకు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా ఇంకొందరు గళం విప్పుతున్నారు. ఎమ్మెల్యే అనుకూలురు కొందరు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని, దీనిని ప్రశ్నిస్తే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వాదన వినిపిస్తోంది. ఈ మధ్యనే జంగారెడ్డిగూడెం మునిసిపల్ ప్రాంతంతో పాటు కామవరపుకోట మండలంలో భారీగా వసూళ్లకు పాల్పడడం, ఈ వ్యవహారం కాస్తా రోడ్డున పడడం వివాదాలకు తెరదీసింది.
ఎమ్మెల్యే ఎలీజా ఇలాంటి వాటిని కట్టుడి చేయకపోగా మౌనం దాలుస్తున్నారని, ఇది పార్టీకి క్షేమదాయకం కాదనే వాదనలో కొందరు ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే ఎలీజా వర్గాలుగా విడిపోయారు. దీనికి అనుగుణంగానే ఎవరి వర్గం వారు తమదే పెత్తనం సాగాలన్నట్టు వ్యవహరించడం, దానిలోను చివరి వరకు తమదే పైచేయి కావాలనే వ్యూహంతో పార్టీలో తీవ్ర అలజడి రేగింది. నియోజకవర్గంలో అవినీతి కార్యక్రమాలు క్రమేపీ పెరగడం, దానికి తగ్గట్టు నివారణ చర్యలు తీసుకోవాల్సింది పోయి ఎమ్మెల్యే అంటీముట్టనట్టు వ్యవహరించడం వైసీపీలో కొత్త పోరుకు దారితీస్తోంది.
ఎమ్మెల్యే అనుచరులు కొందరు ఆయన పేరు చెప్పుకుని చేస్తోన్న దందాలకు అంతేలేకుండా పోతుందని సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారాలపై అధిష్టానానికి, పార్టీ పెద్దలకు భారీ ఎత్తున ఫిర్యాదులు అందడంతో జిల్లా కీలక నేతలు, పార్టీ నేతలతో పాటు ఇన్‌చార్జ్ నేతలతో కూఫీ అయితే లాగుతున్నారు. స్థానిక నేతలు సైతం తమకు ప్రాధాన్యత లభించడం లేదని, కష్టపడి పనిచేసే వారికి కాకుండా కేవలం కొన్ని సామాజిక వర్గాల వారికే ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శతో గరంగరం అవుతున్నారు.
అయితే ఈ వ్యవహారంలో ఎంపీ శ్రీథర్ అవినీతి అనే మరకకు పూర్తి దూరంగా ఉంటున్నారు. ఆయన పార్టీ పరంగా ఎమ్మెల్యే, ఆయన వర్గంతో విబేధిస్తున్నా… అవినీతి, అక్రమాల విషయంలో ఆయనపై చిన్న రిమార్క్ కూడా లేదు. ఇక ఎమ్మెల్యే తరపున తమంతట తాముగానే సొంత మనుషులుగా ప్రకటించుకున్న కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు సొంత పార్టీలోనే వస్తుండడం గమనార్హం. మరి ఇలా అయితే.. వచ్చే ఎన్నికల్లో చింతలపూడి సీటు వైసీపీ నుంచి చేజారిపోతోందనే వాదన బలంగా వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates