మోడీ ఆట ముగిసిందా?

అప్ర‌తిహ‌త విజ‌యాల‌తో వ‌రుస‌గా కేంద్రంలో పాగా వేసి.. త‌న‌కు తిరుగులేదని భావిస్తున్న బీజేపీ అగ్ర‌నేత‌, ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఆట ముగిసిందా?  తాను చెప్పిందే.. వేదం.. తాను చేసిందే శాస‌నం అనేలా.. వ్య‌వ‌హ‌రించిన‌.. ఆయ‌న తీరుపై వ్య‌తిరేక‌త ప్రారంభ‌మైందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఇప్పుడు ఇలాంటి చ‌ర్చే జోరుగా సాగుతోంది. వ‌రుస‌గా జ‌రుగుతున్న ప‌రిణామాలు.. మోడీ శ‌కం ముగుస్తోంద‌ని.. ఆయ‌న ఆట‌కు.. ఓట‌మి త‌ప్ప‌ద‌నే సంకేతాలు వ‌స్తున్నాయ‌ని అంటున్నారు.

ప‌రిణామాల ప‌రంపర ఇదీ..

ఒక‌టి:  ఏరికోరి మోడీ జ‌ట్టుక‌ట్టిన బిహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్‌.. ఇటీవ‌ల అదే మోడీ జ‌ట్టు నుంచి త‌ప్పించుకుని బ‌య‌ట‌ప‌డ్డాన‌ని బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేశారు. ఎన్డీయే కూట‌మి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయ‌న‌.. భ‌విష్య భార‌తానికి ఐకానిక్ నాయ‌కుడిగా క‌నిపిస్తున్నార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జాతీయ‌స్థాయిలో మోడీయేత‌ర శ‌క్తుల‌కు నితీష్ ఇప్పుడు బ‌ల‌మైన నాయ‌కుడిగా క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

రెండు: ఇది అత్యంత సంచ‌ల‌న‌మైన విష‌యం. తొలిసారి జ‌రిగిన ఘ‌ట‌న కూడా. అంత‌ర్జాతీయ స్థాయిలో త‌న పాల‌న‌కు త‌నే స‌ర్టిఫికెట్లు ఇచ్చుకునే ప్ర‌ధాని మోడీ అస‌లు విశ్వ‌రూపాన్ని త‌మిళ‌నాడు కు చెందిన ఆర్థిక మంత్రి పీటీఆర్ బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. మోడీదంతా కూడా న‌కిలీ ట్రాక్ రికార్డేన‌ని.. ఆయ‌న‌పై విశ్వ‌స‌నీయ‌త కూడా నేతిబీరలో నెయ్యి చంద‌మేన‌ని వ్యాఖ్యానించారు. ఈ ప‌రిణామం ఊహించ‌నిది కావ‌డం గ‌మ‌నార్హం. త‌మిళ‌నాడు ఆర్థిక మంత్రి చేసిన ప్ర‌చారం.. బీజేపీ ఇప్ప‌టి వ‌ర‌కు.. మోడీని వీరుడు.. శూరుడు అంటూ చేసిన పెద్ద ప్ర‌చారానికి పెను గండి కొట్టింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

మ‌రో పెద్ద ఉదంతం: ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డులో స‌భ్యులుగా ఉన్న కీల‌క నాయ‌కులు, ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతాల పునాదుల‌పై రాజ‌కీయ పాఠాలు నేర్చుకున్నకేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ, యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్‌సింగ్ చౌహాన్‌ల‌ను స‌భ్యులుగా తొల‌గించారు.  వాస్త‌వానికి పార్ల‌మెంట‌రీ బోర్డు అంటేనే అత్యంత కీల‌కం. అలాంటి బోర్డు నుంచి వీరిని తొల‌గించ‌డం.. సంచ‌ల‌నంగా మారింది.

ఈ ప‌రిణామాల‌తో మోడీ వ్య‌తిరేక కూట‌మి మ‌రింత బ‌ల‌పేతం అయ్యే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. అయితే.. అవ‌కాశం కోసం వీరు ఎదురు చూడొచ్చ‌ని అంటున్నారు. ఇవి కొన్ని ప‌రిణామాలు మాత్ర‌మే.. కానీ, దీనికి మించి.. మోడీ అన్నిఎన్డీయే భాగస్వామ్య పార్టీల‌ను వెన్నుపోటు పొడిచారనే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. అంతేకాదు.. రాష్ట్రాల్లో నమ్మకమైన పొత్తుల అవకాశాలను లేకుండా చేశార‌నేవాద‌న కూడా ఉంది.

ప్ర‌స్తుతం మోడీకి మిగిలిన ఇద్ద‌రుస్నేహితులు, స‌న్నిహితులు ఎవ‌రంటే.. ఈసీ, ఈడీ. అయితే.. ఈ రెండు సంస్థ‌లు కూడా మోడీని ఎన్నాళ్లు మోస్తాయో చూడాల‌నేది ప‌రిశీల‌కుల మాట‌. అనేక స‌వాళ్లు పొంచి ఉన్న నేప‌థ్యంలో ఈ రెండు సంస్థ‌లు మోడీని ర‌క్షించ‌డం సాధ్య‌మేనా? అనేది కూడా ప్ర‌ధాన ప్ర‌శ్న‌. TINA (ప్రత్యామ్నాయం లేదు) కారకం మోడీకి ఇప్పటివరకు పనిచేసింది, ఇది చాలా వైఫల్యాలు మరియు ప్రతిచోటా ఎదురుగాలులతో ఔచిత్యాన్ని కోల్పోయింది. దాదాపు ద‌శాబ్ద కాలం పాటు ఏర్ప‌డిన చీక‌ట్లు 2024లో తొలిగిపోయే అవ‌కాశం ఉంద‌ని, ప్ర‌పంచంలో అత్యంత నిజ‌మైన ప్ర‌జాస్వామ్య‌, బ‌ల‌మైన ఆర్థిక వ్య‌వ‌స్థ ఏర్ప‌డుతుంద‌ని అంటున్నారు.