రాజగోపాల్ చెప్పినట్లే జరుగుతోందా?

మునుగోడు ఎంఎల్ఏగా రాజీనామా చేసేటపుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఏదైతే చెప్పారో ఇపుడు అదే జరుగుతోందా ? కేసీఆర్ వైఖరి చూస్తుంటే జనాలు అవుననే అనుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే గడచిన మూడేళ్ళుగా తన నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం తాను ఎన్ని ప్రతిపాదనలు అందించినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని రాజగోపాల్ ఆరోపించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేనపుడు ఇక ఎంఎల్ఏగా ఉండి ఉపయోగం ఏమిటని అన్నారు.

తాను రాజీనామా చేస్తే అన్నా కేసీఆర్ మునుగోడు అభివృద్ధిని పట్టించుకుంటారేమో అని చెప్పి రాజీనామా చేశారు. అప్పుడు రాజగోపాల్ ఏదైతే చెప్పారో ఇపుడు కేసీయార్ అలాగే చేస్తున్నారు. ఉపఎన్నిక ఖాయమవ్వటంతో టీఆర్ఎస్ గెలుపు కోసమని ప్రభుత్వం ఆగమేఘాల మీద అభివృద్ధి పనులు మొదలుపెడుతోంది. మండలాలు, గ్రామాలవారీగా ప్రభుత్వం నిధులను కేటాయిస్తోంది. చేయాల్సిన డెవలప్మెంట్ పనులను యుద్ధ ప్రాతిపదికన మొదలుపెట్టేస్తోంది.

జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్దికి ప్రణాళికలను యంత్రాంగం తయారుచేస్తోంది. ప్రణాళికల ప్రకారం సీఎం ఆమోదం తీసుకుని ఆర్ధికశాఖ నిధులను విడుదల చేసేస్తోంది. పంచాయతీరాజ్ భవనాల నిర్మాణం, గ్రామాల్లో అంతర్గత రోడ్లు, అంగన్ వాడీ భవనాలు, యువజన సంఘాల భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం ఇప్పటికే సుమారు రు. 100 కోట్లు విడుదల చేసింది. ఈనెల 20వ తేదీన మునుగోడు హెడ్ క్వార్టర్స్ లో ప్రజా దీవెన పేరుతో కేసీఆర్ బహిరంగ సభ జరగబోతోంది.

బహిరంగ సభకు ముందుగానే నిధులు విడుదల చేసి పనులు మొదలుపెట్టాలని కేసీయార్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారట. అయితే ఇక్కడ కేసీయార్ గమనించాల్సిందేమంటే హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో కూడా అభివృద్ధి పనులు ఒక్కసారిగా జోరందుకున్నాయి. ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నంతవరకు నియోజకవర్గంలో ఎలాంటి పనులు జరగలేదని అర్ధమైపోయింది. కారణాలు ఏవైనా వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా టీఆర్ఎస్ గెలవలేదు. మరిపుడు మునుగోడులో కూడా హుజూరాబాద్ పద్దతిలోనే నిధులు విడుదల చేసి పనులు మొదలు పెట్టిస్తున్నారు. అంటే తనకిష్టం లేని ఎంఎల్ఏ నియోజకవర్గాల్లో కేసీఆర్ ఎలాంటి డెవలప్మెంట్ చేయరని అర్ధమైపోయింది. మరి మునుగోడులో మాత్రం టీఆర్ఎస్ గెలుస్తుందని గ్యారెంటీ ఏమిటి ?