మోడీ భయపడుతున్నారా?

బీజేపీలో సీనియర్ నేత, ఆర్ఎస్ఎస్ తో బలమైన బంధాలు కలిగిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అంటే నరేంద్ర మోడీ భయపడుతున్నారా ? పార్టీలో జరిగిన తాజా పరిణామాలు చూసిన తర్వాత సర్వత్రా అదే చర్చ జరుగుతోంది. మొదటి నుండి గడ్కరీ అంటేనే మోడీ కాస్త దూరంగా ఉంటున్నారు. తన మంత్రివర్గంలో గడ్కరీని దూరంగా పెట్టింది లేదు. అలాగని నెత్తినెక్కించుకున్నదీ లేదు. మొత్తం మంత్రివర్గంలో మోడీ తర్వాత అమిత్ షా దే ఆధిపత్యం అన్న విషయం ప్రతి ఒక్కళ్ళకు తెలుసు.

చాలా శాఖలపైన అమిత్ షా దే పెత్తనం సాగుతుంది కానీ గడ్కరీ జోలికి మాత్రం వెళ్ళటం లేదట. ఎందుకంటే గడ్కరీకి ఉన్న బలమైన నేపథ్యమే దీనికి కారణమని పార్టీ వర్గాలే చెబుతాయి. అలాంటి బలమైన గడ్కరీని తాజాగా మోడీ బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుండి తప్పించారు. గడ్కరీని మాత్రమే కాకుండా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ను కూడా పంపేశారు. చౌహాన్ను పంపేయటంలో పెద్దగా ఎవరికీ ఆశ్చర్యం లేదు.

కానీ గడ్కరీని పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించటమే చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే నాగ్ పూర్లోని ఆర్ఎస్ఎస్ కేంద్ర నాయకత్వంతో సన్నిహిత సంబంధాలున్న కేంద్రమంత్రిని తప్పించాల్సిన అవసరం మోడీకి లేదు. అయినా తప్పించారంటే ఆయనంటే భయపడుతున్నారు కాబట్టే పార్లమెంటరీ బోర్డునుండి తప్పించినట్లు అనుమానిస్తున్నారు. రేపు ఏ కారణం చేతనైనా ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సొస్తే గడ్కరీ మాత్రమే పోటీదారుడనే ప్రచారం అందరికీ తెలిసిందే.

అంటే మోడీకి ప్రత్యామ్నాయం గడ్కరీనే అని పార్టీలో చాలామంది అనుకుంటున్నారు. కాకపోతే ఇపుడు హఠాత్తుగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరుకూడా వినబడుతోంది. ఏదేమైనా చాలామంది బీజేపీ ముఖ్యమంత్రులతోను, కేంద్ర మంత్రులతోను, మహారాష్ట్రలోని బీజేపీ సీనియర్ నేతలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న గడ్కరీ తనకెక్కడ పోటీ వస్తారో అన్న భయంతోనే మోడీ పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించినట్లు చెప్పుకుంటున్నారు. నిజానికి మోడీని తప్పించాల్సొస్తే ప్రత్యామ్నాయం ఎక్కడున్నా ఆర్ఎస్ఎస్ పట్టుకొచ్చి కుర్చీలో కూర్చోబెడుతుంది. మోడీ ప్రధానమంత్రి అయ్యింది ఈ పద్ధతి లోనే కదా.