టీ-కాంగ్రెస్‌లో `రెడ్ల లొల్లి`.. త‌ప్పెవ‌ర‌ది?

కంచే చేను మేసినచందంగా మారిపోయింది.. తెలంగాణ కాంగ్రెస్ ప‌రిస్థితి అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. కాంగ్రెస్‌ను కాపాడుతు్న్న‌ది.. కాపాడింది.. కాపాడాల్సింది.. తామే అని తెలిసి కూడా.. కీల‌క మైన రెడ్డి సామాజిక వ‌ర్గం త‌మ‌లో తాము.. కొట్లాడుకొనుడు చూస్తే.. ఇక‌, పార్టీ ప‌ని అంతే! అనే మాటే వినిపి స్తుండ‌డం గ‌మ‌నార్హం. విష‌యంలోకి వెళ్తే.. రాష్ట్ర విబ‌జ‌న‌కు ముందుకు.. త‌ర్వాత కూడా.. కాంగ్రెస్ పార్టీకి రెడ్డి వ‌ర్గం ద‌న్నుగా ఉంది. ఆది నుంచి రాజ‌కీయాల్లో రెడ్లు ముందుంటే.. క‌మ్మ సామాజిక వ‌ర్గం.. వ్యాపార‌, పారిశ్రామిక ప‌రంగా దూకుడు చూపింది.

అయితే.. అన్న‌గారు ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంతో ఉమ్మ‌డి ఏపీలో.. క‌మ్మ వ‌ర్గం కూడా.. రాజ‌కీయాల కు చేరువైంది. ఇక‌, దీంతో రెడ్డి వ‌ర్గం మ‌రింత అప్ర‌మ‌త్త‌మై.. సంఘ‌టిత రాజ‌కీయాల‌కు తెర‌దీసింది. దీంతో కాంగ్రెస్ అంటే.. రెడ్డి వ‌ర్గ‌మే.. అనేవిధంగా మారిపోయింది. అలాంటి కాంగ్రెస్‌లో రెడ్డి వ‌ర్గం అనేక ప‌ద‌వులు అనుభ‌వించింది. కాసు బ్ర‌హ్మానంద‌రెడ్డి నుంచి నేదురుమ‌ల్లి, వైఎస్, కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ఇలా.. అనేక మంది రెడ్డి నాయ‌కులు ముఖ్య‌మంత్రులు అయ్యారు.

కానీ, ఎప్పుడూ.. వారి మ‌ధ్య విభేదాలు ఉన్న‌ట్టుగా కానీ.. ఉన్నా బ‌య‌ట ప‌డిన‌ట్టుగా కానీ.. మ‌న‌కు ఎక్క‌డా క‌నిపించ‌దు. దీంతోనే కాంగ్రెస్ పూర్తిస్థాయిలో ప‌ట్టుపెంచుకుని ఉమ్మ‌డి రాష్ట్రంలో అప్ర‌తిహ‌త విన్యాసం చేసింది. అయితే.. రాష్ట్ర విబ‌జ‌న త‌ర్వాత‌.. ప‌రిస్థితి ఒక్క‌సారిగా మారిపోయింది. ముఖ్యంగా తెలంగాణ రాజ‌కీయాల్లో రెడ్డి సామాజిక వ‌ర్గంలోని సీనియ‌ర్ నాయ‌కుల‌కు ప‌ద‌వీ కాంక్ష ప‌ట్టుకుంది. పీసీసీ చీఫ్ ప‌ద‌వి కోసం.. రెడ్డి వ‌ర్గ‌మే త‌ల‌ప‌డిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఉత్త‌మ్ కుమార్‌రెడ్డిని పార్టీ అధిష్టానం చీఫ్‌ను చేసింది.

దీనికి ముందు.. బీసీ నాయ‌కుడు పొన్నాల ల‌క్ష్మ‌య్య‌ను కూడా పీసీసీ చీఫ్‌ను చేసింది. అయితే.. ఆయ‌నకు ఎవ‌రూ స‌హ‌క‌రించ‌లేద‌నే వాద‌నల నేప‌థ్యంలో ఆయ‌న‌ను త‌ప్పించారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు కూడా తెలంగాణ కాంగ్రెస్‌కు రెడ్డి నాయ‌కుడు.. రేవంత్ పీసీసీ చీఫ్‌గా ఉన్నారు. మ‌రి రెడ్డి నాయ‌కుడే అయినా.. కాంగ్రెస్‌లోని రెడ్లు మాత్రం ఆయ‌న‌ను సానుకూల దృక్ఫ‌థంతో చూడ‌డం లేదు. ఎందుకంటే.. ఆయ‌న నియామ‌క‌మే.. వివాదం అయింది కాబ‌ట్టి. అప్ప‌టి వ‌ర‌కు టీడీపీ సైకిల్ దిగి.. కాంగ్రెస్ ప‌గ్గాలు అందుకోవ‌డాన్ని సీనియ‌ర్ రెడ్డి నేత‌లు జీర్ణించుకోలేక పోతున్నారు.

నీ త‌ర్వాత నేను.. నా త‌ర్వాత నువ్వు! అని వంతులు వేసుకున్న‌ట్టుగా పీసీసీ చీఫ్ ప‌ద‌వి కోసం ఎదురు చూసిన రెడ్డి నాయ‌కుల‌కు.. రేవంత్ నియామ‌కం శ‌రాఘాతంగా మారిపోయింది. దీంతో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ స‌హా.. జ‌గ్గారెడ్డి వంటివారు.. బాహాటంగానే రేవంత్‌ను టార్గెట్ చేయ‌డం ప్రారంభించారు. ఇక‌, ఇప్పుడు ఈ వివాదం మ‌రింత పెరిగింది. ఎన్నిక‌ల ముంగిట‌.. పార్టీ గెలిచే అవ‌కాశం ఉన్న విష‌యం తెలిసి కూడా.. నాయ‌కులు.. లోలోన ర‌గిలిపోతుండ‌డం.. అంద‌రినీ విస్మ‌యానికి గురిచేస్తోంది.

నిజానికి తెలంగాణ ఇచ్చింది తామేన‌ని చెప్పుకొనే కాంగ్రెస్ నేత‌లు.. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఏ ఒక్క‌టీ స‌క్సెస్ కాక‌పొవ‌డం గ‌మ‌నార్హం. ఎవ‌రిలో వారు ప‌ద‌వుల కోసం కీచులాడుకొవ‌డంతోనే స‌రిపెడుతున్నారు. స‌రే.. ఇలాంటి ప‌రిస్థితిని సరిదిద్ది..పార్టీని లైన్‌లో పెట్టాల్సిన‌.. కాంగ్రెస్ అధిష్టానం కూడా.. రాత్రికి రాత్రి నిర్ణ‌యాలు తీసుకుని.. పార్టీ చీఫ్‌గా రేవంత్‌ను ప్ర‌క‌టించ‌డం కూడా స‌రికాద‌నే వాద‌న వినిపిస్తోంది.

దీనిపై ఎవ‌రినీ ఎలాంటి స‌ల‌హా కోర‌క‌పోగా.. తాము తీసుకున్న నిర్ణ‌యాల‌కు క‌ట్టుబ‌డాల్సిందేన‌ని.. అధిష్టానం చెప్ప‌డం మ‌రింత వివాదంగా మారింద‌ని అంటున్నారు. ఏదేమైనా.. కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలంగాణ కాంగ్రెస్‌లో ఏర్ప‌డిన వ్య‌క్తిగ‌త వివాదాలు స‌మ‌సిపోక‌పోతే.. అధికార పార్టీ, ప్ర‌త్య‌ర్థి పార్టీ బీజేపీకి.. కాంగ్రెస్ మేలు చేసిన‌ట్టే అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.