ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రజలకు/ ఓటర్లకు ఇచ్చే ఉచిత పథకాల హామీలు.. సంక్షేమ పథకాల వాగ్దానాలపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉచిత తాయిలాలపై హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను నిలువరించలేమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ చెప్పారు. ప్రజలకు సంక్షేమాన్ని అందజేయవలసిన కర్తవ్యం ప్రభుత్వాలకు ఉందని చెప్పారు. బీజేపీ నేత అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణలో తమ వాదనలను కూడా వినాలని తమిళనాడు అధికార పక్షం డీఎంకే దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌లో, ఎన్నికల ప్రచారంలో ఉచిత తాయిలాలపై హామీలు ఇవ్వడాన్ని అనుమతించకుండా ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై సీజేఐ జస్టిస్ రమణ, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ హిమ కొహ్లీ ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. ఈ పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలు చాలా సంక్లిష్టమవుతున్నాయని అభిప్రాయపడింది. ఈ పిటిషన్‌పై విచారణలో తమ వాదనలను వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే సుప్రీంకోర్టును కోరాయి.
ఏది ఉచితం.. ఏది సంక్షేమం?
సీజేఐ జస్టిస్ రమణ మాట్లాడుతూ, ఏది ఉచిత తాయిలం? ఏది కాదు? ఏది సంక్షేమ కార్యక్రమం అనే అంశం చాలా సంక్లిష్టమవుతోందన్నారు. హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను నిరోధించలేమని చెప్పారు. ఏవి సరైన హామీలు? అనేదే ప్రశ్న అని అన్నారు. ఉచిత విద్యను తాయిలం అని అనగలమా? అన్నారు. ఉచిత తాగునీరు, కనీస స్థాయిలో విద్యుత్తును ఉచితంగా అందజేయడాన్ని తాయిలంగా చెప్పగలమా? అని ప్రశ్నించారు. వినియోగదారుల ఉత్పత్తులు, ఉచిత ఎలక్ట్రానిక్స్ పరికరాలను సంక్షేమంగా వర్ణించగలమా? అని ప్రశ్నించారు.
ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయడానికి ఏది సరైన మార్గం? అనేదే ప్రస్తుత చర్చనీయాంశమని సీజేఐ అన్నారు. డబ్బు వృథా అవుతోందని కొందరు అంటారని, అది సంక్షేమమని మరికొందరు అంటారని అన్నారు. ఈ విషయాలు రాన్రానూ జటిలమవుతున్నాయన్నారు… మీరు మీ అభిప్రాయాలను చెప్పండి, చర్చించి, ఆలోచించి, నిర్ణయిస్తాం.. అని చెప్పారు.
రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు మాత్రమే అవి ఎన్నికల్లో గెలవడానికి ప్రాతిపదిక కాబోవని చెప్పారు. దీనికి ఉదాహరణ గ్రామీణ ఉపాధి హామీ పథకమని చెప్పారు. ఈ పథకం ప్రజలకు హుందాగా జీవించే అవకాశాన్ని కల్పించిందన్నారు. ఓటర్లకు హామీలు ఇచ్చినప్పటికీ కొన్ని పార్టీలు ఎన్నికల్లో గెలవడం లేదన్నారు. మొత్తంగా చూస్తే.. ప్రతి విషయాన్నీ రాజకీయ కోణంలో చూడలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పడం గమనార్హం.