ఔను! నిజం. మీరు చదివింది అక్షరాలా కరెక్టే!. సెకను అంటే రెప్పపాటు కాలం. ఈ రెప్పపాటు కాలంలోనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 8 మందిని అనుమతిస్తున్నారు. ఇది సాధ్యమేనా? కనీసం.. శ్రీనివాసుని రూపు రేఖలైనా కనిపిస్తాయా? కనీసం ఆయన తిరునామం అయినా గోచరిస్తుందా? అంటే.. అది `భక్తికి` సంబంధించిన విషయం. ఎవరి అదృష్టం వారిది. ఈ నెల 30వ తేదీ నుంచి 8 రోజుల పాటు తిరుమలలో నిర్వహించనున్న వైకుంఠ వేకాదశి పర్వదినం సందర్భంగా.. శ్రీవారిని దర్శించుకునేందుకు అధికారులు పలువిధాలుగా అవకాశం కల్పించారు.
ఈ క్రమంలో భక్తుల సంఖ్య.. అధికారులు శ్రీవారిని దర్శించుకునేందుకు.. కేటాయించిన గంటలను పరిశీలిస్తే.. సెకనుకు 8 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక, మరో చిత్రమైన విషయం ఏంటంటే.. శ్రీవారికి ఇస్తున్న రెస్టు సమయం(విశ్రాంతి సమయం) ఆ వారం రోజుల్లో కేవలం 2 నుంచి 2.30 గంటలు మాత్రమే. సాధారణ రోజుల్లో 4 గంటల పాటు శ్రీవారికి రెస్టు ఇస్తుండగా.. ఇప్పుడు దానిని బాగా కుదించారు. అంటే.. అటు శ్రీవారు కూడా తన భక్తుల కోసం.. రెస్టు సమయాన్ని త్యాగం చేస్తున్నారనే చెప్పాలి.
ఇవీ వేళలు..
+ వైకుంఠ ఏకాదశికి సంబంధించి తొలి మూడు రోజులపాటు భక్తులకు కేటాయించిన టికెట్లు, దర్శన సమయాన్ని టీటీడీ వెల్లడించింది.
+ తొలిరోజు 30వ తేదీ స్వామి 20 గంటల పాటు భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజు ఏకంగా 57 వేల మందిని దర్శనానికి అనుమతిస్తున్నారు. అంటే.. గంటకు 2850 మంది, నిముషానికి 48 మంది, సెకనుకు 8 మంది చొప్పున శ్రీవారిని దర్శించుకుంటారు.
+ ఇదే రోజు(30న) వీపీఐలకు 4.30 గంటలు కేటాయించారు. అంటే..ఆ సమయంలో సామాన్యులు వేచి ఉండక తప్పదు.
+ 31వ తేదీనాడు.. ఏకంగా 64 వేల మందికి టికెట్లు ఇచ్చారు. ఈ రోజు కూడా 20గంటల చొప్పున స్వామిదర్శనమిస్తారు. కానీ, సెకనుకు 10 మంది చొప్పున దర్శనం చేసుకోవాలి.
+ జనవరి 1న దర్శనానికి 55 వేల మందికి టికెట్లు ఇచ్చారు. ఆరోజు కూడా సెకనుకు 8 మంది చొప్పునే దర్శనం చేసుకోవాలి.
+ అదృష్టం ఏంటంటే.. ఈ మూడు రోజులపాటు అన్ని వీఐపీ, ప్రొటోకాల్ దర్శనాలను రద్దు చేశారు. కానీ.. మధ్యలో నైవేద్య విరామ దర్శనాల సమయంలో వీఐపీలను అనుమతిస్తారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates