భద్రాద్రి కొత్తగూడెంలో డా.మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని, పదేళ్ల కేసీఆర్ పాలనలో ఖమ్మం జిల్లాకు అన్ని రంగాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. అయితే, ఇప్పుడు పరిస్థితి మారిందని, తమ ప్రభుత్వంలో ఖమ్మం జిల్లా నుంచే ప్రతి పథకం ప్రారంభించామని గుర్తు చేశారు. అంతేకాదు, ఈ జిల్లా నుంచి భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి మంత్రులుగా తన కేబినెట్ లో ఉన్నారని, వారు తలుచుకుంటే ప్రభుత్వంలో జరగనిదేదీ లేదని చెప్పారు.
భట్టి విక్రమార్క ఆర్థిక శాఖా మంత్రిగా, తుమ్మల నాగేశ్వర రావు వ్యవసాయ శాఖా మంత్రిగా, పొంగులేటి శ్రీనివాస రెడ్డి రెవెన్యూ మంత్రిగా ఉన్నారని, తాను ముఖ్యమంత్రిని అయినా పాలనకు ఆయువుపట్టు వంటి శాఖలన్నీ ఈ ముగ్గురి దగ్గరే ఉన్నాయని గుర్తు చేశారు. అందుకే, ఈ ముగ్గురు నేతలు తలుచుకుంటే ప్రభుత్వంలో జరగనిదేదీ లేదని చెప్పారు. ఖమ్మం జిల్లా అభివృద్ధికి ఏమి కావాలన్నా అడిగిందే తడవుగా నిధులు, అనుమతులు మంజూరు చేసే బాధ్యత తనదని రేవంత్ రెడ్డి చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో ఖమ్మం ప్రజలు తమ ఓటును ఆయుధంగా ఉపయోగించి మంచి సర్పంచ్‌లను ఎన్నుకోవాలని, డబ్బుకో, మందుకో ఓటేస్తే గ్రామాలు మునుగుతాయని హితవు పలికారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటవంటిదని, 1969 తెలంగాణ ఉద్యమానికి పునాది పాల్వంచ అని గుర్తు చేశారు. ఖమ్మం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates