మునుగోడులోనే మకాం వేయబోతున్నారా?

తొందరలోనే జరగబోయే మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో గెలవటమన్నది ఇటు బీజేపీకి అటు వ్యక్తిగతంగా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి అత్యంత ప్రతిష్టాత్మకమైపోయింది. కాంగ్రెస్ పార్టీలోనే ఎంపిగా, ఎంఎల్ఏగా గెలుస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్ కు పార్టీ కన్నా తామే గొప్పోళ్ళమనే ఫీలింగ్ చాలావుంది. తాము లేకపోతే భువనగిరి పార్లమెంటు పరిధిలో, మునుగోడు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి దిక్కులేదని బలమైన ఫీలింగుంది.

ఈ ఫీలింగుతోనే రాజగోపాల్ కాంగ్రెస్ ఎంఎల్ఏగా రాజీనామా చేసి తొందరలోనే బీజేపీలో చేరి మళ్ళీ పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇపుడు సమస్య ఏమిటంటే రేపటి ఉపఎన్నికలో రాజగోపాల్ గనుక గెలవకపోతే బీజేపీలో పరువు పోవడం ఖాయం. అందుకనే మొత్తం బీజేపీ టీమును మునుగోడులో క్యాంపు వేయిస్తున్నారు. ఈనెల 21వ తేదీన కేంద్ర హోంశాఖ అమిత్ షా బహిరంగ సభ జరగబోతోంది మునుగోడులో.

ఈ నేపధ్యంలోనే కమలం టీమ్ మొత్తాన్ని నియోజకవర్గంలోనే క్యాంపు వేయించాలని డిసైడ్ అయ్యారు. బండి సంజయ్, ఈటెల రాజేందర్, జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ తదితరులంతా వీళ్ళతో పాటు మరికొందరు సీనియర్ నేతలు ఈ నెల నుండి ఉప ఎన్నిక అయిపోయేంత వరకు నియోజకవర్గంలోనే క్యాంపు వేయబోతున్నారు. దీన్నిబట్టే ఉపఎన్నికలో గెలుపును కమలం పార్టీ నేతలు ఎంత ప్రతిష్టగా తీసుకున్నారో అర్ధమైపోతోంది. ఎన్నికల నిర్వహణ వ్యవహారం మొత్తాన్ని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చూసుకుంటున్నారు.

అలాగే ఇతర పార్టీల నుంచి నేతలను బీజేపీలోకి ఆకర్షించే బాధ్యతలన్నీ ఈటల రాజేందర్ కు అప్పగించారు. మద్దతుదారులను సమీకరించటం, ఇంటింటి ప్రచార బాధ్యతలను రాజగోపాలరెడ్డి చూసుకోబోతున్నారు. నియోజకవర్గంలోని ఎస్సీ సామాజిక వర్గాల ఓట్లను ఆకర్షించే బాధ్యత వివేక్ కు అప్పటించారు. ఫైనల్ గా ప్రచార బాధ్యతలు, రోడ్డుషోలు, చిన్న చిన్న సమావేశాలను పార్టీ చీఫ్ బండి సంజయ్ చూసుకోబోతున్నారు. ఇక ఎన్నికల కమిటి నిర్ణయించిన ప్రకారం మిగిలిన నేతలంతా పై కీలకనేతలకు సహకరిస్తారు. మొత్తానికి మొన్నటి సాధారణ ఎన్నికల్లో కూడా రాజగోపాల్ ఇంత కష్టపడలేదేమో అనిపిస్తోంది. చూద్దాం చివరకు ఏమవుతుందో.