అప్పుడెప్పుడో విజన్ 2020 అంటూ నాటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటలు.. భవిష్యత్తును ఎలా చూడాలన్న దానిపై ఆయనకున్న విజన్ ను బయటపెట్టింది. నిజానికి చాలా దూరంగా ఆలోచించి.. రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసిన చంద్రబాబును అప్పట్లో చాలామంది ఎక్కెసం చేసేవారు. కానీ.. ఆయన అప్పటి విజన్ 2020ను ఫాలో అయి ఉంటే.. ఈ రోజున తెలుగు రాష్ట్రాలు మరో లెవల్ లో ఉండేవి. ఫ్యూచర్ ను ఎంతో ముందుగా మదింపు చేసే విషయంలో చంద్రబాబు విజన్ ను ఎవరూ తప్పు పట్టలేరు.
ఐటీ బూమ్ ను గుర్తించి.. అందుకు తగ్గట్లు హైదరాబాద్ ను సిద్ధం చేసిన ఆయన విజన్ కారణంగా.. ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లోని కుటుంబాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారికి గుర్తింపు ఉందంటే.. అది ఐటీ పుణ్యమేనని చెప్పాలి. ఇదిలా ఉంటే వజ్రోత్సవాల వేళ.. టీడీపీ అధినేత నోటి నుంచి సరికొత్త ప్రతిపాదన వచ్చింది. రానున్న 25 ఏళ్లకు విజన్ 2047 పేరుతో సరికొత్త లక్ష్యాల్ని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఆ లక్ష్యంతో పని చేయాలంటూ ఆయన తన మనసులోని ఆలోచనల్ని పంచుకున్నారు.
దేశ వ్యాప్తంగా నదుల అనుసంధానం జరగాలని.. డిజిటల్ యుగంలోనూ అవినీతి ఆమోదయోగ్యం కాదన్న ఆయన.. పేదల అభ్యున్నతికి పని చేయాలన్న ఆశయంతో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని.. ఇప్పటికి టీడీపీ అదే లక్ష్యం కోసం పోరాడుతుందన్నారు. ఇక.. తన విజన్ 2047కు సంబంధించి పది కీలక అంశాల్ని ఆయన పంచుకున్నారు. అవేమంటే..
- రానున్న 25 ఏళ్లకు ప్రభుత్వాలు విజన్ తయారు చేసుకోవాలి. సమస్యలు.. సవాళ్లపై ప్లాన్ రెఢీ చేయాలి.
- విలువలతో కూడిన సమాజాన్ని స్థాపించాలి. ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించాలి.
- బలమైన యువశక్తి ఉన్న దేశం కాబట్టి యువతకు ఎక్కువగా అవకాశాలు కల్పించాలి. దేశంలో సంపద స్రష్టి జరగాలి.
- రైతుల కోసం ప్రత్యేక విధానాలు రూపొందించాలి. 75 ఏళ్ల తర్వాత రైతులు ఆత్మహత్యలు చేసుకోవటం దేశానికి గౌరవం కాదు.
- విద్య.. ఆరోగ్యం అందరికి చేరువ కావాలి.
- మహిళా సాధికారతకు ప్రణాళికల్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది.
- దేశంలో నదుల అనుసంధానం జరగాలి
- అవినీతి లేని పాలనను అందించాలి. సాంకేతికతతోఅవినీతినిఅంతం చేయాలి.
- అన్ని అర్హతలు.. వనరులు ఉన్న మన దేశం ప్రపంచంలో నెంబర్ 1 కావాలి.
- ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా ఒక సంకల్పంతో ప్రణాళికతో పని చేసి లక్ష్యాన్ని సాధించేలా తోడ్పాటు అందించాలి.