గోరంట్ల విడియోపై ఇంత గందరగోళమా?

హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంపై చాలా గందరగోళం రేగుతోంది. అనంతపురం ఎస్పీ ఫకీరప్ప మీడియాలో అనేక సందేహాలకు సమాధానాలు దొరుకుతాయని అందరూ అనుకున్నారు. కానీ ఎస్పీ మాట్లాడిన తర్వాత సందేహాలు మరింతగా పెరిగిపోయాయి. మొదటిదేమిటంటే ఇపుడు సర్క్యులేషన్లో ఉన్న వీడియో ఒరిజినల్ కాదు కాబట్టి అది మార్ఫుడా లేకపోతే ఎడిటింగ్ చేసిందా అని చెప్పలేమన్నారు.

ఇపుడున్న వీడియో ఒరిజినల్ కాదని ఎస్పీ ఎలా చెప్పగలరు ? ఆ విషయం నిర్ధారించాల్సింది ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులే. మరి ల్యాబ్ కు వీడియోను పోలీసులు పంపారా ? అన్నది కీలకమైన ప్రశ్న. ఎస్పీ మాటలను బట్టి వీడియోను ల్యాబ్ కు పంపలేదని అర్ధమవుతోంది. ఇదే నిజమైతే మరి హోంశాఖ మంత్రి తానేటి వనిత, పర్యాటక శాఖమంత్రి రోజా, ఎంపీ భరత్ లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు కోసం వెయిట్ చేస్తున్నామని ఎలా చెప్పారు ?

అంటే మంత్రులు, ఎంపీ అబద్ధాలు చెప్పినట్లేనా ? ఎస్పీ మాట్లాడుతూ ఎంపీ అభిమాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే దర్యాప్తు చేసినట్లు చెప్పారు. వీడియో వెలుగుచూసిన రోజే ఎంపీ మాట్లాడుతూ తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎందుకు చెప్పారు ? లండన్లోని ఒక నెంబర్ నుండి ఐటీడీపీకి వీడియో అప్ లోడయ్యిందని మళ్ళీ అక్కడి నుంచి ఎడిటయిన వీడియో సర్క్యులేట్ అయినట్లు ఎస్పీ చెప్పారు. లండన్లోని మొబైల్ నెంబర్ ఎవరిది ? ఐటీడీపీలో దాన్ని సర్క్యులేట్ చేసిందెవరో పోలీసులు గుర్తించారా ?

ఇలాంటి ప్రశ్నలకు ఎస్పీ సమాధానం చెప్పలేకపోయారు. బాధితులు ఎవరు ఫిర్యాదు చేయలేదు కాబట్టి ఎంపీపై కేసు నమోదు చేయలేదన్న ఎస్పీ వాదన సమర్ధించుకునేందుకు బాగానే ఉంది. కానీ అసలు ఎంపీ ప్రతిష్టను దెబ్బతీసిందెవరు ? వీడియోను సర్క్యులేట్ చేసిందెరో పోలీసులు తేల్చాలి కదా ? లేకపోతే ఎంపీకి వచ్చిన ఉపశమనం తాత్కాలికమే కానీ శాశ్వతం కాదు. మరీ సందేహాలను పోలీసులు ఎప్పటికి తీరుస్తారో ?