బీజేపీ తర్వాత టార్గెట్ ఈ రాష్ట్రమే?

మహారాష్ట్రలోని శివసేన నాయకత్వంలోని  మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చేసిన విషయం అందరికీ తెలిసిందే. సరే ఆ లెక్క బీహార్లో సరిపోయింది. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేసిన బీజేపీ బీహార్లో అధికార పార్టీ హోదా నుంచి ప్రతిపక్షంలోకి వచ్చేసింది. వచ్చే డిసెంబర్లో బెంగాల్లోని మమతాబెనర్జీ ప్రభుత్వాన్ని కూడా కూల్చేయబోతున్నట్లు బీజేపీ హెచ్చరించింది.

బెంగాల్లో బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్లో మమత ప్రభుత్వం కూలిపోతుందన్నారు. అంతేకాకుండా 2024లో జరగబోయే లోక్ సభ ఎన్నికలతో పాటే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయని చెప్పటం ఇపుడు సంచలనంగా మారింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బహిరంగంగా బీజేపీ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.

పోయిన సంవత్సరంలో జరిగిన బెంగాల్లో ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అసలా ఎన్నికలకు ముందే మమత ప్రభుత్వాన్ని కూల్చేయాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేసింది. టీఎంసీకి చెందిన 30 మంది ఎంఎల్ఏలను లాగేసుకుంది. అయితే అంతకు మించి ఎంఎల్ఏలు బీజేపీలో చేరకపోవటంతో మమత ప్రభుత్వం ఎన్నికల వరకు కంటిన్యూ అవ్వగలిగింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలే రాబట్టినా మమత మాత్రం అఖండ మెజారిటితో మళ్ళీ అధికారంలోకి రావటం బీజేపీకి మింగుడు పడలేదు.

అప్పటి నుండి ఏదో పద్ధతిలో తృణమూల్ ప్రభుత్వాన్ని పడగొట్టడమే టార్గెట్ గా పెట్టుకున్నది బీజేపీ. రాష్ట్రంలో తృణమూల్ ప్రభుత్వాన్ని తీసేయటానికి వేదిక రెడీ చేస్తున్నట్లు సువేందు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. నిజానికి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు సువేందు చెప్పినందుకు ఆయనపై కేసు నమోదు చేయచ్చు.  బెంగాల్లో లాగానే ఝార్ఖండ్, రాజస్థాన్ లో కూడా కాంగ్రెస్  ప్రభుత్వాలను పడగొట్టేస్తామంటు సువేందు గతంలో కూడా హెచ్చరించారు. అంటే ఏదో పద్దతిలో దేశమంతా తాను  మాత్రమే అధికారంలో ఉండాలనేది బీజేపీ ఆలోచనగా అర్ధమవుతోంది. మరీ విపరీత పోకడలను జనాలు ఎలా తట్టుకుంటారో చూడాలి.