తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇరిటేట్ చేసే పనికి కొన్నేళ్ల క్రితం శ్రీకారం చుట్టిన బండి సంజయ్.. రోజులు గడిచే కొద్దీ ఆ ప్రయత్నాన్ని మరింత ప్రభావవంతంగా చేస్తున్నారు. ఎలాంటి మాటలకు కేసీఆర్ మండిపడతారో.. ఎలాంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణిస్తారో.. సరిగ్గా అవే మాటల్ని సంధిస్తున్న బండి సంజయ్ తాజాగా మరో అస్త్రాన్ని బయటకు తీశారు. టీఆర్ఎస్ కు కొత్త అర్థాన్ని ఇచ్చేలా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు గులాబీ బాస్ కు కాలిపోయేలా చేస్తాయని చెప్పక తప్పదు.
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఖాసీం చంద్రశేఖర రజ్వీగా పేరు మార్చిన బండి సంజయ్.. టీఆర్ఎస్ పార్టీ పేరును తన మార్కుకు ఏ మాత్రం తగ్గని రీతిలో పెట్టిన వైనం కేసీఆర్ కు కాలి కంకరెత్తేలా మారుతుందని చెప్పక తప్పదు. టీఆర్ఎస్ కు.. ‘తెలంగాణ రజాకార్ల సమితి’గా అభివర్ణించారు. అంతేకాదు.. అప్పట్లో నిజం రాజును లొంగదీసుకునేందుకు నాటి భారత ప్రభుత్వం నిర్వహించిన అపరేషన్ పోలో మాదిరి.. మరో ఆపరేషన్ పోలోతో అధికార టీఆర్ఎస్ ను బొంద పెడతామని ఆయన మండిపడ్డారు.
తాజాగా మరోసారి పాదయాత్రను చేపట్టిన బండి సంజయ్.. తన మాటల్లో మరింత ఘాటును పెంచేశారు. టీఆర్ఎస్ కు కొత్త పేరుపెట్టిన ఆయన అక్కడితో ఆగక.. మజ్లిస్ తో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్న వైనాన్ని ప్రస్తావిస్తూ.. దానిపై కఠినమైన వ్యాఖ్యలు చేయటం ద్వారా గులాబీ దళానికి మరింత మంట పుట్టేలా బండి వ్యాఖ్యలు ఉన్నాయి. ‘‘ కేసీఆర్ మెడలు వంచి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేలా చేస్తాం. బీజేపీ అధికారంలోకి రాగానే గుండ్రాంపల్లిని తెలంగాణ స్పూర్తి కేంద్రంగా మారుస్తాం. రజాకార్లపై గుండ్రాంపల్లి ప్రజలు చేసిన పోరాటాలను మర్చిపోలేం. గుండ్రాంపల్లి పోరాట యోధుల కుటుంబాలకు తప్పనిసరిగా ఇండ్లు నిర్మించి ఇస్తాం. అన్ని విధాలా ఆదుకుంటాం’’ అని పేర్కొన్నారు.
ఇప్పటివరకు తెలంగాణ ప్రజలు మర్చిపోయిన గుండ్రాంపల్లి పోరాటాల ఎపిసోడ్ ను సమయానికి తగ్గట్లు తీసిన బండి.. భావోద్వేగ బంధనాల్ని మరింత బలంగా అల్లుతున్నారని చెప్పాలి. టీఆర్ఎస్ పేరుకు కొత్త అర్థం చెప్పటం.. కేసీఆర్ పేరుకు ఎప్పుడూ లేని విధంగా ఖాశీం రజ్వీని పోల్చటం.. గుండ్రాంపల్లి ప్రజల పోరాటాల్ని ప్రస్తావించి.. ప్రస్తుతించడం లాంటివి చూస్తే.. బండి సంజయ్ తన రూట్ మ్యాప్ కు తగ్గట్లు ముందుకు వెళుతున్నారని అర్థం కాక మానదు. మరి.. దీనికి సీఎం కేసీఆర్ కౌంటర్ మాటేంటి? అన్నదిప్పుడు అసలు ప్రశ్నగా చెప్పక తప్పదు.