బీజేపీ లెక్క సరిపోయిందా?

బీజేపీ లెక్క సరిపోయినట్లుంది. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేసిన బీజేపీ తాజా బీహార్ పరిణామాలు పెద్ద షాకనే చెప్పాలి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దెబ్బకు బీజేపీ బీహార్లో ప్రభుత్వంలో నుండి బయటకు వెళ్ళిపోయింది. బీజేపీ భాగస్వామ్యంతో ఇంతకాలం ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చిన జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీష్ రాజీనామా చేయటంతో ప్రభుత్వం కూలిపోయింది. ఫలితంగా బీజేపీ రోడ్డున పడిపోయింది.

బీజేపీతో కటీఫ్ చెప్పిన నితీష్ వెంటనే ఆర్జేడీ, కాంగ్రెస్ తో జట్టు కట్టారు. సీఎంగా రాజీనామా చేసిన నితీష్ కాసేపటికే ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు గవర్నర్ కు చెప్పారు. 243 ఎంఎల్ఏలున్న బీహార్లో జేడీయూకి 43, ఆర్జేడీకి 80, కాంగ్రెస్ కు 19 మంది ఎంఎల్ఏలున్నారు. వామపక్షాలకు 16 మంది ఎంఎల్ఏలున్నారు.  122 ఎంఎల్ఏల మద్దతు మ్యాజిక్ ఫిగర్ అయితే తమ కూటమికి అంతకుమించిన మద్దతే ఉందని నితీష్ ప్రకటించారు.

దాంతో బీజేపీకి దిక్కుతోచటం లేదు. ఎదుటివాళ్ళకు ఒకకన్ను పోవాలని కోరుకుంటే మనకు రెండు కళ్ళు పోతాయనే నానుడి ఉంది. అదే ప్రకారం మహారాష్ట్రలో శివసేనను దెబ్బకొట్టేందుకు ఎంవీఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎక్ నాథ్ షిండేని అడ్డుపెట్టుకుని  బీజేపీ కూల్చేసింది. పోనీ తర్వాతన్నా బీజేపీ హ్యాపీగా ఉందా అదీలేదు. షిండేని ఆయన వర్గంలోని 40 మంది ఎంఎల్ఏలు మంత్రిపదవుల కోసం సతాయించేస్తున్నారు. దాంతో అక్కడ ఎప్పుడేమవుతుందో ఎవరు చెప్పలేని రాజకీయం నడుస్తోంది.

ఇదే సమయంలో బీహార్లో ప్రభుత్వం కూలిపోయింది. తమ మిత్రపక్షం అధినేత, సీఎం నితీష్ కొట్టిన దెబ్బకు బీజేపీ అగ్రనేతలకు బుర్ర తిరిగిపోయిందనే చెప్పాలి. సీఎంగా రాజీనామా చేసిన నితీష్ మళ్ళీ వెంటనే ఆర్జేడీ, కాంగ్రెస్ సహకారంతో ముఖ్యమంత్రి అవుతున్నారు. మరి బీజేపీ పరిస్ధితి ఏమిటి ? మహారాష్ట్రలో ఎంవీఏ ప్రభుత్వం కూల్చేసేందుకు పట్టిన సమయం కూడా ఇక్కడ పట్టలేదు. సరిగ్గా 24 గంటల్లోనే బీజేపీ అధికార భాగస్వామి హోదా నుండి ప్రతిపక్ష పార్టీ అయిపోయింది. దీన్నే కాలమహిమంటారు.