తెలుగుదేశం పార్టీలో యువతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన పాలిట్ బ్యూరో సమావేశంలో యువతకు మరింత ప్రాధాన్యత ఇవ్వటంలో భాగంగా సమగ్ర అధ్యయనం చేయించాలని కూడా నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో యువతకే 40 శాతం టికెట్లిస్తామని చంద్రబాబు ఎన్నిసార్లు ప్రకటించారో అందరు చూసిందే. మరిపుడు తాజా ప్రకటన ఏమిటో అర్ధం కావటం లేదు.
నిజానికి ఇపుడు పార్టీలో సీనియర్లుగా ఉన్నవారిలో అత్యధికులు పార్టీ పెట్టినప్పుడు 1983లో చేరినవారే. యనమల రామకృష్ణుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, అశోక్ గజపతిరాజు లాంటి అనేకమంది అప్పట్లో యువతగానే పార్టీలో చేరారు. అయితే కాలక్రమంలో పార్టీలో చేరిన వాళ్ళల్లో యువత శాతం తగ్గిపోయింది. అప్పట్లో యువతగా పార్టీలో చేరిన వారే ఇపుడూ కంటిన్యు అవుతున్నారు. దాంతో పార్టీలో యువత ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇపుడు యువతంటే సీనియర్ల వారసులు మాత్రమే అన్నట్లుగా ముద్రపడిపోయింది.
సీనియర్ల వారసులను కాకుండా ఇతరత్రా యువతను పార్టీ ప్రోత్సహిస్తే మరింతగా యువత పార్టీలో చేరే అవకాశముంది. రాబోయే ఎన్నికల్లో 40 శాతం యువతకే ఎన్నికల్లో టికెట్లిస్తానని బహిరంగంగా ప్రకటించిన చంద్రబాబు ఇపుడు యువతపై సమగ్ర అధ్యయనం చేయించాలని డిసైడ్ చేయటం ఏమిటో అర్ధం కావటం లేదు. పార్టీ సభ్యత్వం వివరాలను చూస్తే యువత ఎవరు? ఎంతమంది యువత ఉన్నారనే విషయం వెంటనే తేలిపోతుంది. దీనికి పెద్ద అధ్యయనం అవసరమే లేదు.
మామూలుగా అయితే 19 నుంచి 35 మధ్య వయస్సులో ఉన్న వారిని యూత్ గా పిలుస్తుంటారు. మరీ వయసులోని వారు పార్టీలో ఎంతమంది ఉన్నారనే విషయాన్ని ముందుగా లెక్క తేల్చాలి. దాని ప్రకారం రాబోయే ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తే నిజంగానే యువతను ప్రోత్సహించినట్లవుతుంది. యువతను ప్రోత్సహించటంలో మళ్ళీ వారసులకే ప్రాధన్యత ఇస్తే మాత్రం ఇబ్బందులు తలెత్తటం ఖాయం. యువతకు టికెట్లివ్వటం వేరు వారసత్వ హోదాలో టికెట్లిచ్చి ప్రోత్సహించటం వేరన్న విషయం గ్రహించాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates