కేసీఆర్ పై ఒత్తిడి పెంచేస్తున్న గవర్నర్

తెలంగాణలో గవర్నర్ తమిళిసైకి ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య గ్యాప్ బాగా పెరిగిపోతోంది. ప్రజా సమస్యలపై గవర్నర్ కూడా ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నారు. సమస్యలు తెలుసుకునేందుకు నేరుగా ప్రజలతోనే మాట్లాడుతున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు డైరెక్ట్ గా ప్రజల్లోకే వెళిపోతున్నారు. తాజాగా ఆందోళనలు చేస్తున్న ఐఐఐటి విద్యార్దులను కలిసి సమస్యలు తెలుసుకునేందుకు గవర్నర్ నేరుగా బాసరకే వెళ్ళటం సంచలనంగా మారింది.

సమస్యల పరిష్కారానికి కొద్దిరోజులుగా విద్యార్ధులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. తమకు వైఎస్ ఛాన్సలర్ లేరని, ఫ్యాకల్టీ సరిగాలేదని, హాస్టల్ లో ఫుడ్ బాగుండటం లేదనే కారణాలతో విద్యార్థులు గోలగోల చేస్తున్నారు. హాస్టల్లో భోజనం తిని విద్యార్ధులు ఇప్పటికి మూడుసార్లు అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చేరినా ప్రభుత్వం పట్టించుకోకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఇందుకనే గవర్నర్ రంగంలోకి దిగారు. నేరుగా బాసర వెళ్ళి విద్యార్ధులతోనే ముఖాముఖి మాట్లాడారు.

ప్రభుత్వం తనకివ్వాల్సిన ప్రోటోకాల్ గురించి తానెప్పుడో మరచిపోయినట్లు చెప్పారు. ప్రోటోకాల్ పాటించినా పాటించకపోయినా తాను మాత్రం ప్రజా సమస్యలపై స్పందిస్తునే ఉంటానని ప్రకటించారు. త్రిబుల్ ఐటీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని ప్రకటించటం సంచలనంగా మారింది. 2017 నుండి విద్యార్ధులకు ల్యాప్ ట్యాపులు ఇవ్వటం లేదని ప్రభుత్వంపై  మండిపడ్డారు. వసతి గృహాల నిర్వహణ కూడా బాగా లేదన్నారు. తొందరలోనే మిగిలిన యూనివర్సిటీలను కూడా సందర్శిస్తానని చెప్పారు.

మొత్తానికి కేసీయార్ తో తనకున్న వైరాన్ని గవర్నర్ రోడ్డు మీదకు తీసుకొచ్చేశారు. నరేంద్ర మోడీతో తనకు పడని కారణంగా ఆ కోపాన్నంతా కేసీఆర్ గవర్నర్ పై చూపిస్తున్నారు. గవర్నర్ కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్  ను కూడా ప్రభుత్వం పాటించటం లేదు. ఇందుకు కేసీయారే బాధ్యత వహించాల్సుంటంది. అంటే గవర్నర్ జనాల్లోకి వెళ్ళకూడదని, సమస్యలు తెలుసుకోకూడదని ఏమీ లేదు. కాకపోతే ఆ బాధ్యత ప్రజాప్రతినిధులది. గవర్నర్ ప్రజల్లోకి వెళ్ళినా సమస్యలను పరిష్కరించాల్సింది ప్రభుత్వమే. అందుకనే మామూలుగా గవర్నర్లు జనాల్లోకి వెళ్ళరు. ఎందుకంటే వెళ్ళినా ఉపయోగముండదు కాబట్టి. కానీ ఇక్కడ కేసీయార్ పై తమిళిసై ఒత్తిడి పెంచేందుకే జనాల్లోకి వెళుతున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.