ఇంకో ఐదు రోజుల్లో లాల్ సింగ్ చడ్డా థియేటర్లలో విడుదల కానుంది. దేశవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టారు. భీకరమైన ట్రెండ్ కనిపించడం లేదు కానీ పోటీలో ఉన్న అక్షయ్ కుమార్ రక్షా బంధన్ తో పోలిస్తే చాలా మెరుగైన నెంబర్లు నమోదవుతున్నాయి. తెలుగులోనూ పెద్ద రిలీజ్ ఇవ్వబోతున్నారు. నాగ చైతన్య ఓ కీలక పాత్ర చేయడం, మెగాస్టార్ చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరించడం, అమీర్ ఖాన్ పదే పదే హైదరాబాద్ వచ్చి ప్రీమియర్లు వేసి మరీ తన సినిమాను ప్రమోట్ చేసుకోవడం ఇవన్నీ సానుకూలంగా కనిపించేవే.
ఇక్కడితో అయిపోలేదు. సోషల్ మీడియాలో, ఒక వర్గం సాధారణ జనంలో అమీర్ పట్ల ఉన్న వ్యతిరేకత దీనిపై బాయ్ కాట్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తనను అపార్థం చేసుకోవద్దని ఆయన పదే పదే చెబుతున్నా గతంలో తనతో పాటు మాజీ భార్య చేసిన కొన్ని కామెంట్లు, పికె సినిమాలో హిందూ దేవుళ్ళ మీద చేసిన కామెడీని క్షమించమంటూ కొందరు తమ స్వరాన్ని జోరుగా వినిపిస్తున్నారు. కేవలం అమీర్ నే టార్గెట్ చేసి ఇంతకన్నా దారుణంగా వ్యవహరించిన వాళ్ళను కేవలం మతం కారణంగా వదిలేశారని అమీర్ ఫ్యాన్స్ కూడా కౌంటర్లిస్తున్నారు
ఏది ఏమైనా ఈ మొత్తం వ్యవహారం లాల్ సింగ్ చడ్డా మొదటి రోజు చాలా కీలకంగా మారనుంది. దంగల్ రేంజ్ లో బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇబ్బంది లేదు కానీ యావరేజ్ అన్నా చాలు పైన చెప్పిన బ్యాచ్ ట్రోలింగ్ తో రెచ్చిపోతుంది. సో పబ్లిక్ రెస్పాన్స్ చాలా కీలకంగా నిలవనుంది. రక్షా బంధన్ కు సైతం ఈ భయాలు లేకపోలేదు. ఈ మూవీ రచయిత కనిక థిల్లాన్ ఎప్పుడో సంవత్సరాల క్రితం వేసిన కొన్ని యాంటీ హిందూ ట్వీట్లును స్క్రీన్ షాట్ల రూపంలో బయటికి తీసినవాళ్లున్నారు. మొత్తానికి 11న ఎలాంటి బాక్సాఫీస్ తీర్పు రానుందో చూడాలి