ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి నాయకుడు. ప్రభుత్వ మాజీ ఉద్యోగి. 2014లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. టీడీపీ టికెట్‌పై విజయం దక్కించుకున్నారు. ఆయనే రావెల కిశోర్‌బాబు. గుంటూరు జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం ప్రత్తిపాడు నుంచి విజయం దక్కించుకున్న ఆయన టీడీపీ హయాంలో మంత్రి అయ్యారు. అయితే.. ఆయన అనతి కాలంలో వివాదాలకు కేంద్రంగా మారారు. సొంత పార్టీ నాయకురాలు.. గుంటూరు జెడ్పీ చైర్మన్‌తో వివాదాలకు దిగారు. అదేసమయంలో కుమారుల వల్ల కూడా అపకీర్తి వచ్చింది.
దీంతో చంద్రబాబు ఆయనను మంత్రి పదవి నుంచి పక్కన పెట్టారు. ఆ తర్వాత.. క్రమంలో గత ఎన్నిక లకు ముందు పార్టీ నుంచి బయటకు వచ్చి.. జనసేన తరపున పోటీ చేశారు. అయితే.. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆతర్వాత.. మళ్లీ ఏమైందో ఏమో.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక్కడ కూడా ఆయన నిలదొక్కుకోలేక పోయారు. ఈ క్రమంలో కొన్నాళ్ల కిందట.. మళ్లీ ఆ పార్టీని కూడా వదిలేశారు. ఇక, అప్పటి నుంచి ఆయన ఎటు వైపు వెళ్తారు? ఏ పార్టీ ఆయనకు తీర్థం ఇస్తుంది.? అనే చర్చ సాగుతోంది.
అయితే.. ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు.. రావెలకు ఎవరూ టికెట్ ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని సమాచారం. టీడీపీలో చేరినప్పటికీ.. ఆయనకు టికెట్ ఇవ్వొద్దని.. కీలక నాయకులు కొందరు చంద్రబాబుపై ఒత్తిడి పెంచారు. దీంతో ఆయన మొదట్లో కిశోర్‌కు ఆహ్వానం పలికేందుకు సిద్ధపడినా.. టికెట్ విషయంలో మాత్రం ఆశలు వద్దని.. క్లూ ఇచ్చారట. దీంతో బీజేపీ నుంచి బయటకు రాగానే .. ఇంటి ముందు.. టీడీపీ జెండాలు కట్టించుకున్న రావెల.. తర్వాత.. ఓ ఫైన్ నైట్ వాటిని తీసేయించారు.
ఇక, ఇప్పుడు.. ఏ పార్టీ కూడా ఆయనవైపు చూడడం లేదు. దీంతో ఇప్పుడు ఏంచేయాలి? అనేది రావెల ముందున్న ప్రశ్న. ఈ క్రమంలో గత నెల రోజులుగా ఆయన ప్రజల మధ్య తిరుగుతున్నారు. ప్రజల సమస్యలపై రియాక్ట్ అవుతున్నారు. ఎస్సీ యువతను చేరదీసి.. రోజుకు ఇంత అని భత్యం ఇచ్చి.. వారిని ఆయనతో తిప్పుకొంటున్నారు. ప్రస్తుతం జెండా ఏమీ లేకపోయినా.. అనుచరులతో మాత్రం ఆయన నియోజకవర్గంలో తిరుగుతున్నారు. దీనిని బట్టి వచ్చే ఎన్నికల్లో ఆయన ఒంటరి పోరుకు రెడీ అవుతున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates