ఢిల్లీకి చంద్ర‌బాబు… బీజేపీ పెద్ద‌ల‌తో భేటీ!

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు చాలా నెల‌ల త‌ర్వాత‌.. మ‌ళ్లీ ఢిల్లీ బాట ప‌ట్టారు. ఈ ద‌ఫా ఆయ‌న‌కు బీజేపీ పెద్ద‌ల‌తో భేటీ ఉంటుంద‌నే అంచ‌నాలు బ‌లంగా వినిపిస్తున్నాయి. గ‌తంలో టీడీపీ ఆఫీసుపై వైసీపీ నాయ‌కులు కొంద‌రు క‌ర్ర‌లు, రాళ్ల‌తో దాడులు చేసిన విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌యంలో చంద్ర‌బాబు ఒక రోజు దీక్ష కూడా చేశారు. అనంత‌రం.. ఆయ‌న ఢిల్లీ వెళ్లి.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీకి ప్ర‌య‌త్నించారు. అయితే.. అప్ప‌ట్లో ఆయ‌నకు ఆ అవ‌కాశం ద‌క్క‌లేదు. దీంతో రెండు రోజులు వేచి చూసి వెనుదిరిగారు.

మ‌ళ్లీ ఆ త‌ర్వాత‌.. వెళ్లాల‌ని అనుకున్నా.. చంద్ర‌బాబు వెనుక‌డుగు వేశారు. అయితే.. ఇప్పుడు ప‌రిస్థితులు మారాయ‌నే సంకేతాలు వ‌చ్చాయి. ఇటీవ‌ల రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో టీడీపీ అధినేత వ్య‌వ‌హ‌రించిన తీరుతో బీజేపీకి-చంద్ర‌బాబుకు మ‌ధ్య ఏర్ప‌డిన గ్యాప్ త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని.. స్వ‌యంగా కేంద్ర మంత్రి జి. కిష‌న్‌రెడ్డి కూడా.. చంద్ర‌బాబు ప‌ట్ల సానుకూల దృక్ఫ‌థం ఏర్పడే విధంగా ఢిల్లీలో చ‌క్రం తిప్పుతున్నార‌ని.. కొన్నాళ్లుగా ఒక స‌మాచారం పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో హ‌ల్చ‌ల్ చేస్తోంది.

ఇక‌, రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో తాము కోర‌కుండానే ద్రౌప‌ది ముర్ముకు చంద్ర‌బాబు మ‌ద్ద‌తివ్వ‌డం ప‌ట్ల అమిత్ షా స‌హా బీజేపీ చీఫ్ న‌డ్డా కూడా హ్యాపీగానే ఉన్నార‌ని.. అప్ప‌ట్లో స‌మాచారం వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఇప్పుడు చంద్ర‌బాబు తాజా ఢిల్లీ ప‌ర్య‌ట‌న చాలా ప్రాధాన్యం సంత‌రించుకుంది. పైగా.. ఏపీ బీజేపీ చీఫ్ కూడా చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు త‌గ్గించారు. అంతేకాదు.. ఆయ‌న ఇటీవ‌ల రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల సంద‌ర్భంగా.. చంద్ర‌బాబుతో క‌లిసి ప‌క్క‌నే కూర్చున్నారు.

మ‌రోవైపు.. జాతీయ‌స్థాయిలోనూ చంద్ర‌బాబుకు సానుకూల ప‌రిణామాలు పెరుగుతున్న నేప‌థ్యంలో తాజాగా చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌కు ప్రాదాన్యం ఏర్ప‌డింది. ప్ర‌ధాని మోడీ కాక‌పోయినా.. ఖ‌చ్చితంగా చంద్ర‌బాబుకు అప్పాయింట్‌మెంట్ ఇచ్చేవారిలో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా ఉన్నార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. చంద్ర‌బాబు ఢిల్లీలో రెండు రోజులు ఉండ‌నున్నారని, ఆజాదీకా అమృత్ మ‌హొత్స‌వాల్లో ఆయ‌న పాల్గొంటార‌ని.. పార్టీ నాయ‌కులు తెలిపారు.

అదే స‌మ‌యంలో ఆయ‌న రాష్ట్ర‌ప‌తి ముర్మును క‌లిసి అభినందిస్తార‌ని.. చెప్పారు. ఈ గ్యాప్‌లో ఎక్క‌డో ఒక చోట ఖ‌చ్చితంగా ఆయ‌న కు బీజేపీ పెద్ద‌ల నుంచి పిలుపు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని.. చెబుతున్నారు. అయితే.. దీనికి సంబంధించి ముంద‌స్తు అప్పాయింట్‌మెంట్ ఏమీ ఖ‌రారు లేద‌ని.. మాత్రం చెబుతున్నారు. అత్యంత ర‌హ‌స్యంగా అయినా.. ఏదో ఒక‌టి జ‌రుగుతుంద‌ని.. అంచ‌నా వేస్తున్నారు. మ‌రి చంద్ర‌బాబుకు అమిత్ షా కానీ, న‌డ్డా కానీ, ఛాన్స్ ఇస్తారేమో.. అనే చ‌ర్చ కూడా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.