క‌లిసివ‌చ్చే కాలం.. క‌మ‌లానిదా.. కారుదా..

తెలంగాణ రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి. ఇప్ప‌టికే కోమ‌టిరెడ్డి రాజగోపాల్ కాంగ్రెస్‌కు దూరం కావ‌డం.. మ‌రో 12 మంది వ‌ర‌కు నాయ‌కులు త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని.. బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజ‌య్ కామెంట్లు చేయ‌డంతో తెలంగాణ‌లో అస‌లు ఏం జ‌రుగుతోంది? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఇక‌, సీఎం కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లు.. మోడీపై యుద్ధాలు.. అంటూ ఆయ‌న చేస్తున్న కామెంట్ల నేప‌థ్యంలో జాతీయ స్థాయిలో తెలంగాణ రాజ‌కీయాలపై జోరుగా చ‌ర్చ‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

తెలంగాణలో మూడోసారి కూడా అధికారంలోకి వ‌స్తామ‌ని.. టీఆర్ ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే.. తామేం త‌క్కువ తిన‌లేద‌ని.. తాము కూడా తెలంగాణ రావ‌డంలో భాగ‌మేన‌ని.. క‌మ‌లం నాయ‌కులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో విక‌సించి తీరుతామ‌ని.. బీజేపీ నేత‌లు చెబుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తెలంగాణ పీఠం ఎవరికి దక్కబోతోందనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర గడువుంది. అయిన‌ప్ప‌టికీ.. పార్టీలు, నేతల హడావిడి  మాత్రం ఎన్నికల వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పిస్తోంది.

మ‌రోవైపు.. స‌ర్వే రాయుళ్లుకూడా భారీ ఎత్తున స‌ర్వేలు గుప్పిస్తున్నారు. ఇటీవలే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించడం…పార్టీ జాతీయ నేతలంతా ఇక్కడకు రావడంతో తెలంగాణా బీజేపీ కార్యకర్తల్లో జోష్ కనిపిస్తోంది. ఇక మోడీని ఎదిరించేది కేసీఆర్ మాత్రమే అన్నట్లు జాతీయ స్థాయిలో టీఆర్‌ఎస్ చేస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు. మరోవైపు తెలంగాణాలో పీసీసీ పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న రేవంత్‌రెడ్డి పార్టీని అధికారంలోకి తీసుకువ‌స్తాన‌ని చెబుతున్నారు.

ఈ క్ర‌మంలో రాష్ట్రంలో రాజ‌కీయ కాక భారీ ఎత్తున పెరిగింద‌నే చెప్పాలి. ఇక‌, దాదాపు అన్ని పార్టీలు కూడా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తోంది. దీనిలో భాగంగానే పార్టీలు పోటీలు పడి మరీ ఇతర పార్టీల నేతలకు కండువాలు కప్పుతున్నాయి. ఇతర పార్టీల నుంచి ఎంత ఎక్కువ మంది నాయకులు తమ పార్టీలో చేరితే అంత బలం వచ్చినట్లు ఫీల్ అవుతున్నాయి.  టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌లు తెలంగాణాలో దేనికదే తమ పార్టీయే బలమైన శక్తిగా భావిస్తోంది.  

2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులను కేసీఆర్ త‌న పార్టీలో చేర్చుకున్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లోనూ ప్రతిపక్షాల నేతలను టీఆర్ఎస్‌ వదల్లేదు. దీంతో చాలా నియోజకవర్గాల్లో బలమైన నాయకులంతా ఇప్పుడు అధికార పార్టీలోనే ఉన్నారు.  తెలంగాణాలోని ముఖ్య పార్టీల్లోని సీనియర్ నేతలు ఎక్కువ మంది టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

దీంతో ప్రస్తుతం తెలంగాణా రాష్ట్ర సమితి బలమైన నాయకత్వంతో కనిపిస్తోంది. అధికారం ఉండటంతో అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ హవా కొనసాగింది. గులాబీ పార్టీకి గ్రామస్థాయి నుంచి బలమైన నాయకులున్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ బలం నాయకులే… బలహీనత కూడా నాయకులే.

ఇక‌, కాంగ్రెస్‌లో అస‌మ్మ‌తి నాయ‌కులు ఇప్ప‌టికీ దారికి రాలేద‌నేది వాస్త‌వం. రేవంత్ దూకుడు బాగున్నా.. ఆయ‌న‌కు స‌హ‌క‌రించే సీనియర్లు వేళ్ల‌పై లెక్కించుకునే ప‌రిస్థితిలో ఉన్నారు. దీంతో రేవంత్ త‌న‌కంటూ.. సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు. ఇక‌, బీజేపీ అన్ని వైపుల నుంచి వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. ఈ క్ర‌మంలోనే జాతీయ‌స్థాయిలో తెలంగాణ పాలిటిక్స్ చ‌ర్చ‌కు రావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో . ఎవ‌రు అధికారంలోకివ‌స్తారో చూడాలి.