గోరంట్ల మాధవ్‌.. కథ ముగిసినట్లేనా?

ఇప్పుడు తెలుగు నెటిజన్ల దృష్టిని ప్రధానంగా ఆకర్షిస్తున్న అంశం.. వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారమే. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీలో నేతల రాసలీలల గురించి వార్తలు రావడం తొలిసారేమీ కాదు. ఆ పార్టీకి ఒకప్పుడు మద్దతుదారుగా ఉన్న కమెడియన్ పృథ్వీ ఒక మహిళతో జరిపినట్లుగా ప్రచారం జరిగిన సరస సంభాషణ అప్పట్లో హాట్ టాపిక్ అయింది.

ఇక ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌లు సైతం ఇలాంటి కుంభకోణాల్లోనే ఇరుక్కున్నట్లు వార్తలొచ్చాయి. ఐతే వీరిలో పృథ్వీ పదవి కోల్పోయి, చివరికి వైకాపాకు దూరం కావాల్సి వచ్చింది. ఐతే అంబటి రాంబాబు పేరుతో ఒకటికి రెండు ఆడియోలు వార్తల్లోకి వచ్చినా, అవంతి పేరు మీద కూడా ఒక ఆడియో హల్‌చల్ చేసినా వారి మీద ఎలాంటి విచారణ, చర్యలు చేపట్టలేదు వైకాపా. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలేంటన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి.

కట్ చేస్తే ఇప్పుడు గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ప్రత్యర్థులు వైకాపాను మామూలుగా టార్గెట్ చేయట్లేదు. ఈ విషయాన్ని మాధవ్ పట్టించుకోకుండా వదిలేసినా పోయేదేమో. కానీ ఆయన మీడియా ముందుకు వచ్చారు. వీడియో మార్ఫింగ్ చేశారని, అందులో ఉన్నది తాను కాదని వాదించారు. కానీ వీడియోను పరిశీలిస్తే జనాలకు అలాంటి అనుమానం అయితే కలగట్లేదు.

అలా అని మాధవ్ విషయంలో ఒక నిర్ణయానికి కూడా వచ్చేయలేం. ఈ వీడియో విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానని, కోర్టుకు ఎక్కబోతున్నానని మాధవ్ అన్నారు. ఆయన ఎంత వరకు వెళ్తారు.. పోలీసులు, నిపుణులు ఏం తేలుస్తారు.. మాధవ్ విషయంలో జనాభిప్రాయం ఏంటి అన్నది పక్కన పెడితే.. మాధవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ, అక్కడి ప్రభుత్వం ఈ వీడియో విషయంలో ఎలా స్పందిస్తుందని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఐతే అంబటి రాంబాబు, అవంతిల విషయంలో మాదిరి ఈ విషయాన్ని చూసీ చూడనట్లు విడిచిపెట్టే పరిస్థితి కనిపించడం లేదు.

ఈ వీడియోపై విచారణ జరుపుతున్నామని, అది మార్ఫ్డ్‌కాదు, ఒరిజినల్ అని తేలితే చర్యలు ఉంటాయని ప్రభుత్వ సలహాదారు, పార్టీ అగ్ర నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఆయన ఇలా స్పందించారంటేనే ఇష్యూను సీరియస్‌గా తీసుకున్నారన్నది స్పష్టం. వీడియో ఒరిజినలే అని మెజారిటీ జనం భావిస్తున్న నేపథ్యంలో దాని వల్ల వ్యక్తిగతంగా జరిగే డ్యామేజీకి తోడు పార్టీ, ప్రభుత్వం తరఫున కూడా చర్యలు చేపడితే రాజకీయంగా గోరంట్ల మాధవ్ కథ ముగిసినట్లే అన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.