ఏపీ హైకోర్టును మార్చే విషయంపై కేంద్రం మళ్లీ మళ్లీ అదే మాట చెబుతోంది. గత పార్లమెంటు సమావేశాల్లో.. ఈ విషయం తమ పరిధిలో లేదని చెప్పిన కేంద్రం.. తాజాగా కూడా ఇదే విషయం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం-ఏపీ హైకోర్టు సంయుక్తంగా ఒక నిర్ణయం తీసుకుని.. తమకు పంపిస్తే.. దానిపై చర్చించి.. రాష్ట్రపతికి ప్రతిపాదిస్తామని.. హైకోర్టు పరిధిలో తాము జోక్యం చేసుకునేది లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
అంతేకాదు, ఏపీ హైకోర్టును కర్నూలుకు మార్చే ప్రతిపాదన పెండింగ్‌లో లేదని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ మరోసారి తేల్చి చెప్పింది. తాజాగా రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి కిరణ్‌రిజిజు మాట్లాడుతూ విభజన చట్టానికి అనుగుణంగా 2019 జనవరిలో..ఏపీ హైకోర్టు ప్రధాన బెంచ్‌ను కేంద్రం ఏర్పాటు చేసిందని చెప్పారు. 2020 ఫిబ్రవరిలో హైకోర్టును అమరావతి నుంచి.. కర్నూలుకు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు.
హైకోర్టును కర్నూలుకు మార్చడంపై ఏపీ ప్రభుత్వం, హైకోర్టు.. తమ అభిప్రాయాన్ని కేంద్ర న్యాయశాఖకు సమర్పించాలని చెప్పారు. కానీ, ఇప్పటి వరకు ఆ ప్రతిపాదన ఏదీ కూడా తమకు చేరలేదని.. చెప్పారు. తమ ఇష్టానుసారంగా హైకోర్టుపై ఎలాంటి నిర్ణయం తీసుకునేది లేదని.. కేంద్రంలోని మోడీ సర్కారు స్పష్టం చేసింది. ప్రస్తుతం కేంద్రం దగ్గర హైకోర్టును మార్చే ప్రతిపాదన పెండింగ్‌లో లేదని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
ఇక, ఇప్పటికే హైకోర్టును కర్నూలుకు తరలిస్తున్నామని.. వైసీపీ నాయకులు పదే పదే చెబుతున్నారు. కానీ, ఇదంతా రాజకీయంగా తమకు అనుకూల పరిస్థితిని మార్చుకునేందుకు.. మాత్రమే చేస్తున్న వ్యూహంగా పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు.. బీజేపీ కూడా.. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తే.. సహకరిస్తామని చెబుతోంది. కానీ, ఇప్పటికే హైకోర్టు.. అమరావతిలో ఏర్పాటు చేసినందున దీనిని ఎలా మారుస్తారనేది.. ఇప్పటికే హైకోర్టు సంధించిన ప్రశ్న. ఏదేమైనా.. హైకోర్టుపై వైసీపీ సర్కారు ఆటలు ఆడుతోందనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.