మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి అధికార టీఆర్ఎస్ పార్టీలో వేడి మొదలైంది. ఎంఎల్ఏగా రాజీనామా చేస్తున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ ప్రకటించారంతే. ఎప్పుడు చేసేది ఇంకా ఆయన చెప్పలేదు. రాజీనామా చేస్తే, దాన్ని స్పీకర్ ఆమోదిస్తే ఉపఎన్నిక జరిగే అవకాశముంది. అప్పుడు బీజేపీలో చేరిన తర్వాత మళ్ళీ రాజగోపాలే పోటీచేసే అవకాశముంది. కాబట్టి తమ పార్టీల తరపున ఎవరు పోటీ చేయబోతున్నారనే విషయాన్ని ప్రకటించాల్సింది టీఆర్ఎస్, కాంగ్రెస్సే.
సరే కాంగ్రెస్ ను వదిలేస్తే అభ్యర్ధిని ఎంపికచేయటం పూర్తిగా కేసీయార్ నిర్ణయమే అన్న విషయం తెలిసిందే. అభ్యర్ధిని ఎంపిక చేసేముందే హైదరాబాద్ లో అమలుచేసిన వ్యూహాన్నే మునుగోడులో కూడా చేయాలని కేసీయార్ నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ వ్యూహం ఏమిటంటే అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో జనాలను ఉక్కిరిబిక్కిరి చేయటం. ఈటెల రాజేందర్ రాజీనామా చేసిన తర్వాత హుజూరాబాద్ లో ఉపఎన్నిక తప్పదని తేలిపోయిన తర్వాతే అభివృద్ధి కార్యక్రమాలు మొదలయ్యాయి.
రోడ్లు, భవనాలు, డ్రైనేజీ కాల్వలు ఏర్పాటు తదితరాలన్నింటినీ కేసీయార్ మొదలు పెట్టేశారు. అలాగే దళిత బంధు లాంటి సంక్షేమపథకాలను ప్రకటించారు. అంటే అప్పటి వరకు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అర్ధమైంది. మరప్పటి వరకు మంత్రిగానే ఉన్న ఈటెల ఏమి చేశారో జనాలకు అర్థం కాలేదు. సరే ఉపఎన్నిక పుణ్యమాని నియోజకవర్గంలో ఎంతోకొంత అభివృద్ధి జరిగింది. వందల కోట్ల రూపాయలు ఖర్చులుపెట్టినా చివరకు టీఆర్ఎస్ అభ్యర్ధి ఓటమి తప్పలేదు.
ఇపుడు మునుగోడులో కూడా అదే సీన్ కనబడుతోంది. రాజగోపాల్ ఆరోపణల ప్రకారం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మరిపుడు ఉప ఎన్నికల కారణంగానే రోడ్లు, భవనాల నిర్మాణం లాంటి అభివృద్ధి కార్యక్రమాలకు తొందరలోనే మొదలుపెట్టబోతున్నారట. అలాగే నియోజకర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పథకాలను వర్తింపచేయాలని కేసీయార్ ఆదేశించినట్లు సమాచారం. అంటే ఉప ఎన్నికలు వస్తేకాని నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగదని జనాల్లో క్లారిటీ వచ్చేసింది. మరిక్కడైనా టీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తారా ?