రాజకీయాల్లో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం మామూలే. ఐతే ప్రత్యర్థి పార్టీని టార్గెట్ చేసేటపుడు అన్నిసార్లూ గుడ్డిగా ఎదురు దాడి చేయకూడదు. ప్రతి విషయాన్నీ తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూడకూడదు. విషాదంతో, ఎమోషన్లతో ముడిపడ్డ విషయాలను వివాదం చేయాలని చూస్తే బూమరాంగ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు చేస్తున్నది ఆ కోవలోకే వచ్చేలా ఉంది.
ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి మరణం మీద వివాదం రాజేయాలని చూసి సోషల్ మీడియాలో వైసీపీ నేతలు, మద్దతుదారులు పెడుతున్న పోస్టులు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. గతంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో వారి కుటుంబ సభ్యుల మీదే బలంగా అనుమానాలు వ్యక్తం కావడం, సీబీఐ విచారణలో కూడా అవినాష్ రెడ్డి లాంటి వాళ్ల పాత్ర మీద బలమైన ఆరోపణలు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ వాళ్లు #Whokilledbabai అనే హ్యాష్‌ట్యాగ్‌ను సోషల్ మీడియాలో బాగా జనాల్లోకి తీసుకెళ్లారు.
ఐతే దానికి బదులుగా అన్నట్లు ఇప్పుడు ఉమామహేశ్వరి మరణం మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ #Whokilledpinni అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి దీన్ని వివాదం చేయాలని చూస్తున్నారు వైకాపా మద్దతుదారులు. ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ అయిన గుర్రంపాటి దేవేందర్ రెడ్డి. అతను మాత్రమే కాదు.. ట్విట్టర్లో తన స్థాయికి తగని ట్వీట్లతో నిత్యం నెటిజన్లతో తిట్టించుకునే ఎంపీ విజయసాయిరెడ్డి సైతం ఇదే అంశాన్ని లేవనెత్తుతూ ట్వీట్లు వేశారు. ఐతే ఉమామహేశ్వరి అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ, డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకున్నారని మెజారిటీ జనాలు నమ్ముతున్నారు.
ఇక్కడ ఎవరి నుంచీ అనుమానాలు వ్యక్తం కావడం లేదు. అసలా చర్చే లేదు ఎక్కడా. ఈ మరణంతో వివేకా హత్యను పోల్చడానికి అవకాశమే లేదు. ఎన్టీఆర్ తనయురాలు ఇలా ప్రాణాలు కోల్పోవడం పట్ల పార్టీలతో సంబంధం లేకుండా అందరూ అయ్యో అనుకుంటున్నారు. ఇలాంటి సున్నితమైన విషయంలో రాజకీయాలు చేయడం, దీన్ని వివాదంగా మార్చే ప్రయత్నం చేయడం తటస్థంగా ఉండేవారికి కూడా నచ్చట్లేదు. దీని ద్వారా ఏం ప్రయోజనం పొందుదామని అనుకున్నారో కానీ.. అది బూమరాంగ్ అయి వైసీపీకి డ్యామేజ్ చేసేలా కనిపిస్తోంది.