కొన్ని కొన్ని సార్లు చిత్రమైన ఘటనలు జరుగుతుంటాయి. ఎంకి పెట్టి.. సుబ్బిచావు.. అన్నట్టుగా.. కొన్ని కొన్ని కార్యాకారణ సంబంధాలతో ముడిపడి కొనసాగుతాయి. ఇప్పుడు కూడా అలాంటి ఘటన తెరమీదికి వచ్చింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తాజాగా పార్టీకి, పదవికి కూడా రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీజేపీలోకి చేరడానికి ముహూర్తం కూడా ఖాయం చేసుకున్నారు. ఇది రాజకీయ దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే.
అయితే.. ఇదే సమయంలో మునుగోడు ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇక, మంచి రోజులు రానున్నాయని వారు అంటున్నారు. ఎందుకంటే.. ఇప్పటి వరకు ఇక్కడ కాంగ్రెస్ నేత ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడంతో.. అధికార పార్టీ.. ఈ నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. దీంతో అభివృద్ధి అనేది పేరుకు మాత్రమే వినిపించేది. ఇదే కదా.. అనేక సందర్భాల్లో కోమటిరెడ్డి ప్రశ్నించింది. అయితే.. ఇప్పుడు ఎలానూ ఉప ఎన్నిక ఖాయమైంది.
ఈ క్రమంలోనే మునుగోడు నియోజకవర్గానికి ఇప్పటివరకు మంజూరు చేసిన నిధులను ఇప్పుడు విడుదల చేయడానికి టిఆర్ఎస్ పార్టీ రెడీ అవుతున్నట్లుగా నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. గతంలో హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలోనూ ఈటల రాజేందర్ ను ఓడించడం కోసం టిఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గంలో నిధుల వరద కురిపించింది. పెద్ద ఎత్తున అభివృద్ధి చేసింది.
ఇక తాజాగా మునుగోడు నియోజకవర్గంలో కూడా అభివృద్ధిపై దృష్టి సారించబోతున్న టిఆర్ఎస్ ఇకపై వేగంగా నిధులు మంజూరు చేయాలని భావిస్తోంది. అయితే హుజురాబాద్ లో టిఆర్ఎస్ పార్టీకి దెబ్బ తగిలినట్టు, మునుగోడులో తగలబోదని గట్టి నమ్మకంతో ఉన్నారు నాయకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి, హుజురాబాద్ నియోజకవర్గ తరహాలో జరుగుతుందేమో అన్న చర్చ స్థానికంగా పెద్ద ఎత్తున జరుగుతుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates