ఇటీవల శాసన మండలిపై విమర్శలు చేసిన ఎపి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తాజాగా హైకోర్టుపై సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రభుత్వ పాలసీలలో కోర్టుల జోక్యం దారుణం. ఇది ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ చొరబడడమే‘‘ అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ముందు ఇలా జరగకూడదు అన్నట్టు ఆయన వ్యాఖ్యలు ఉండటం ఆశ్చర్యం.
ఇది ఇలాగే కొనసాగితే ఇక ఎన్నికలు ఎందుకు? ఎమ్మెల్యేలు కావడం ఎందుకు? అన్నిటిని కోర్టులే ఆపమని అంటుంటే… ఇక ఈ వ్యవస్థలు ఎందుకు? న్యాయస్థానాలు ప్రభుత్వాన్ని నడిపిస్తాయా? అంటూ ఆయన ప్రశ్నించిన ఆయన దీనిపై విస్తృతంగా చర్చలు జరగాలి, మేధావులు దీనిపై చర్చించాలి… అని ఆయన అభిప్రాయపడ్డారు.
బాధతోనే కోర్టు తీర్పులు అంగీకరిస్తున్నాము అని చెప్పిన తమ్మినేని సీతారాం. మా నిర్ణయాలు తప్పైతే గెలిపించిన ప్రజలే మళ్లీ ఓడిస్తారు కదా అన్న సందేహం వెలిబుచ్చారు. రాజ్యాంగాన్ని గౌరవించి ముందుకు వెళుతున్నాము. మనీ బిల్లును ఆపడం రాజకీయాల్లో వికృత చేష్టలకు పరాకాష్ట. నా రాజకీయ జీవితంలో ఇలాంటిది చూడలేదు అని తమ్మినేని వ్యాఖ్యానించారు.
అయితే, ఇక్కడ ఒక విషయం ప్రస్తావనార్హం… కోర్టుకు ఇతర వ్యవస్థల్లో జోక్యం చేసుకునే హక్కులేదు. అయితే, రాజ్యాంగాన్ని మీరినపుడు దానిని మీరకుండా ఆదేశించే హక్కును అదే రాజ్యాంగం కోర్టులకు కల్పించింది. ఇది రాజ్యాంగ నిర్మాణంలో భాగమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates