“మధ్యనిషేధమా”?.. మా మ్యానిఫెస్టోలో లేదు

మద్యపాన నిషేధంపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ వింత వివరణ ఇచ్చారు. “మా మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం అనే మాటే లేద”ని.. అన్నారు. అంతేకాదు.. మద్యం ధరను ఫైవ్‌స్టార్ హోటల్ రేట్లకు తీసుకెళ్తామని మాత్రమే చెప్పామన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి.

“మద్యం కాపురాల్లో చిచ్చు పెడుతోంది.. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి.. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం… మద్యాన్ని ఫైవ్‌ స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తాం” ఇదీగ‌త ఎన్నికల మేనిఫెస్టోలో.. స్వ‌యంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ పేర్కొన్న నాలుగు లైన్ల వాగ్దానం. త‌ర‌చుగా దీనిపైనే రాష్ట్రంలోని విప‌క్ష పార్టీలు వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌ను నిల‌దీస్తున్నాయి.

ఏరులై పారుతున్న మ‌ద్యాన్ని నిషేధించేది ఎప్పుడ‌ని.. కూడా ప్ర‌శ్నిస్తుంటాయి. కానీ, మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మాత్రం మద్యపాన నిషేధం అనే మాటే మా మ్యానిఫేస్టోలో లేదు అన్నారు. రాష్ట్రంలో మద్యం ధరను ఫైవ్ స్టార్ హోటల్ రేట్లకు తీసుకువెళ్తామని చెప్పామని.. అదే చేస్తున్నామన్నారు. ఎవరైనా తాగాలంటే షాక్ కొట్టేట్టుగా ధరలను చేస్తామని తమ అధినేత జ‌గ‌న్ చెప్పారన్నారు.

అస‌లు జ‌గ‌న్ ఏం చెప్పారు?

ఔను.. అస‌లు జ‌గ‌న్ ఏం చెప్పారంటే.. శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, అనంత‌పురం, క‌ర్నూలు, గుంటూరుల్లో నిర్వ‌హించిన‌.. పాద‌యాత్ర సంద‌ర్భంగా ఈ ఐదు చోట్ల ఆయ‌న ప్ర‌జ‌ల‌తో మాట్లాడారు. “రాష్ట్రంలో మ‌ద్యం తాగుతున్న భ‌ర్త‌ల కార‌ణంగా మ‌హిళ‌లు పుస్తెలు అమ్ముకుని.. పిల్లోళ్ల‌ను పెంచుకోవాల్సి వ‌స్తోంది. మీ అన్న‌.. మీ త‌మ్ముడు.. మీ మ‌న‌వ‌డు అధికారంలోకి వ‌స్తే.. విడ‌త‌ల వారీగా.. మ‌ద్యంపై నిషేధం విధిస్తాం. మొద‌టి సంవ‌త్స‌రం 25 శాతం..రెండో సంవ‌త్స‌రం మ‌రో 25 శాతం.. ఇలా మొత్తంగా ఐదో సంవ‌త్స‌రం వ‌చ్చే స‌రికి రాష్ట్రంలో అస‌లు మ‌ద్యం అనేదే లేకుండా చేస్తాం… అని ఈ సంద‌ర్భంగా మాటిస్తున్నా. అది కూడా.. మ‌ద్యం ధ‌ర‌లు సామాన్యుల‌కు అందుబాటులో లేకుండా.. షాక్ కొట్టేలా చేస్తాం” అని చెప్పారు. మ‌రి.. దీనిని బ‌ట్టి.. అధినేత చెప్పింది త‌ప్పా.. ఇప్పుడు మంత్రిగారు సెల‌విచ్చింది త‌ప్పా..? ఏది త‌ప్పు.. ఏది ఒప్పు… ?!