ఔను.. కొందరు నేతలు అంతే.. ఈ మాట.. ఏపీలో రెండు కీలక పార్టీల మధ్య జోరుగా వినిపిస్తోంది. వీరిలో వైసీపీ నాయకులు ఉన్నారు. టీడీపీ నేతలు కూడా ఉన్నారు. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తుంటే.. చోద్యం చూస్తున్న తమ్ముళ్లు.. వైసీపీని రికార్డు స్థాయి లో గట్టెక్కించి.. తిరిగి అధికారంలోకి రావాలని.. వైసీపీ అధినేత సీఎం జగన్ ప్రయత్నిస్తుంటే.. నేతలు.. తమకు ఏమీ పట్టనట్టు.. తాము ఏమీ విననట్టే వ్యవహరిస్తున్నారు.
“నిజమే పార్టీ అధికారంలోకి రావాలని మాకు కూడా ఉంది. కానీ, ఇప్పుడే తొందర ఎందుకు. ఇంకా రెండేళ్లు ఉంది అప్పుడు చూసుకుందాం” అని విజయవాడ సమీపంలోని ఓ నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యేనే ఒకరు వ్యాఖ్యానించారు. ఈయన ఒక్కరే కాదు.. సీమలోనూ… దాదాపు 10 నియోజకవర్గాల్లో నాయకులు.. అసలు పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదు. అదేమంటే.. ఇప్పుడే ఎందుకు? అనే మాట చాలా సునాయాసంగా వారి నోటి నుంచి వచ్చేస్తోంది.
మరోవైపు.. వైసీపీలోనూ .. ఇదే పంథా కొనసాగుతోంది. ఒకవైపు పార్టీ అధినేత సీఎం జగన్.. తిరగండి.. ప్రజల మధ్య ఉండండి.. అని నాయకులకు ఆదేశాలు ఇస్తున్నారు. అయితే.. వీటిని పాటిస్తున్నవారు.. ప్రజలతో ఉంటున్నవారు. పార్టీ కార్యక్రమాలు చేస్తున్న వారు.. మారు.. 50 నుంచి 70 మంది లోపే! ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఇక, మిగిలిన పార్టీల పరిస్థితిని చూస్తే.. బీజేపీరాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు మరో ఇద్దరు ముగ్గురు నాయకులు కనిపిస్తున్నారు. మిగిలిన వారు అసలు ఎక్కడున్నారో కూడా తెలియదు.
ఇక, జనసేన పరిస్థితి.. పవన్ వస్తే.. పండగ.. లేకపోతే.. ఇంక అంతే సంగతులు. మరి దీనిని బట్టి.. అసలు నాయకులు.. ఏం ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు.. ఏ పార్టీని తీసుకున్నా.. బలైమన గళం వినిపించే నాయకులు కనిపించేవారు. పార్టీ ఏదైనా.. అది కాంగ్రెస్సా.. కమ్యూనిస్టా.. అనేది పక్కన పెడితే.. బలమైన విశ్లేష ణలు చేసిన నాయకులు ఉండేవారు. ప్రజల సమస్యలపై అవగాహన ఉన్న నాయకులు కనిపించేవారు. కానీ.. ఇప్పుడు అంతా రెడీ మేడ్! వారికి సబ్జెక్టు ఉండడం లేదు.. నోరు తెరిస్తే.. బూతులు తప్ప. వారికి మరో వ్యూహ తెలియదు.. అధినేత భజన తప్ప!! అనే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే.. కొందరు నాయకులు.. ఇంతే.. మహప్రభో..! అనేస్తున్నారు నాయకులు.
కొసమెరుపు ఏంటంటే.. ఇప్పుడు ఇంతగా.. నాయకులు కలిసి రావడం లేదని.. పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం లేదని.. ప్రజల మధ్య ఉండడం లేదని.. వగరుస్తున్న అధినేతలు.. పార్టీలు.. ఎన్నికల సమయం రాగానే.. వారికే.. అలాంటి వారికే టికెట్లు ఇవ్వడం.. ఆశ్చర్యం!! ఇది కదా.. రాజకీయం అంటే!!