కళ్లు మూసుకుని తాగినంత మాత్రాన పిల్లిని ఎవరూ చూడరని అనుకోవడం తప్పే కదా..! అలాగే.. ఏపీ రాజధాని విషయంలో బీజేపీ నేతలు.. ముఖ్యంగా కేంద్రంలోని పెద్దలు చేయాల్సిందంతా చేసేసి.. ఇప్పుడు ఏమీ ఎరుగబోమని.. చేస్తున్న వ్యాఖ్యల పై సామాన్యులు మండిపడుతున్నారు. తాము ఏం చేసినా.. ప్రజలు ఏమీ అనరు ధోరణి ఇటీవల కాలంలో నాయకులకు పెరిగిపోయింది. ఎన్నికలు రాగానే.. ఏమీ తెలియని అమాయకుల్లా ప్రజల ముందు నటించేస్తున్నారు.
అయితే.. ప్రజలు మాత్రం అన్ని విషయాలను గుర్తు పెట్టుకుంటున్నారు. కేంద్రం ఏం చేస్తోందో.. రాష్ట్ర పాలకులు ఏం చేస్తున్నారో.. రెండు ప్రభుత్వాలు కలిసి.. ఏం నాటకాలు ఆడుతున్నాయో.. స్పష్టంగా గమనిస్తున్నారు. దీనికి ఉదాహరణే.. తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఎదురైన ఘాటు సంఘటన. శుక్రవారం.. అమరావతిలో రాజధాని ఉద్యమం మరో రూపంలో ప్రారంభమైంది. రాజధాని ప్రాంతాల్లోని గ్రామాల్లో పాదయాత్ర చేయాలని రైతులు నిర్ణయించుకున్నారు.
వారం రోజుల పాటు ఈ పాదయాత్రను చేసేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి.. రైతుల పక్షానే తాము ఉన్నమని చెప్పేందుకు సోము ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన కూడా.. రైతుల పాద యాత్రను ప్రారంభించి.. కొద్ది దూరం ఆయన కూడా నడిచారు. ఈ సందర్భంగా తనకు ఎదురైన వారితో ఆయన బీజేపీ ప్రమోషన్‌పై చర్చించే ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ రైతుతో మాట్లా డుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ గురించి.. రాజధాని గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలోరాజధాని ప్రాంతానికి చెందిన ఒక పెద్దాయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే.. ఆ పెద్దాయన వెంటనే రియాక్టయి.. వాడు మీరు తోడు తోడుదొంగలై... రాజధానిని ఇలా నాశనం చేశారు
అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో అవాక్కయిన సోము వీర్రాజు.. ఐదేళ్లు ఆగవయ్యా..నువ్వు
అంటూ.. అక్కడ నుంచి చిరచిరలాడుతూ.. కొరకొర చూస్తూ.. జారుకున్నారు. అయితే.. ప్రస్తుతం ఈ వీడియో.. సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుండడం గమనార్హం.
ఎందుకంటే.. ఆ పెద్దాయన ఆగ్రహంలోనూ.. అర్ధం ఉందని అంటున్నారు.. పరిశీలకులు. రాజధానికి శంకు స్థాపన చేసిందే ప్రధాని నరేంద్ర మోడీ. తర్వాత.. ఇప్పటి వరకు రాజధాని ఎలా ఉందని కూడా ఆయన ఆరా తీయలేదు. కనీసం.. నిధుల ఊసు కూడా లేదు. పైగా జగన్..మూడు రాజధానులు అని చేసిన ప్రకటన తర్వాత.. కూడా అదెలా.. రాజధాని అమరావతి ఉంది కదా! అని అన్న పాపాన పోలేదు. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ప్రజలు.. తాజాగా సోముకు షాక్ ఇచ్చారు. మరి ఇప్పటికైనా.. నాయకులు ప్రజల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తారో లేదో చూడాలి.