కేంద్రంపై నిందలు మొదలుపెట్టిన వైసీపీ !

ఇపుడిదే ఎవరికీ అర్థం కావటం లేదు. రెండు రోజులుగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటు జగన్మోహన్ రెడ్డి అటు విజయసాయిరెడ్డితో పాటు కొందరు ఎంపీలు గట్టిగా మాట్లాడుతున్నారు. కోనసీమ జిల్లాలో వరద బాధితులను పరామర్శించిన సందర్భంగా జగన్ మాట్లాడుతూ పునరావాస ప్యాకేజికి నిధులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే అన్నారు. తాను నరేంద్రమోడీకి కలిసినపుడు ఈ విషయమై నిలదీస్తానని చెప్పారు. కేంద్రం నుండి పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన రు. 20,000 కోట్లు ఆగిపోయినట్లు చెప్పారు.

కేంద్రంతో పోరాడైనా రావాల్సిన నిధులకోసం ప్రయత్నం చేస్తానన్నారు. గతంలో కేంద్రం నుండి రావాల్సిన బకాయిల గురించి ఎప్పుడూ ఇలా పబ్లిక్కులో మాట్లాడలేదు. ఇక రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ అప్పుల విషయంలో రాష్ట్రాలను నిందిస్తున్న కేంద్రం తాను చేస్తున్న అప్పుల గురించి ఏమి చెబుతుందని నిలదీశారు. ఆర్ధిక పరిస్దితిపై లెక్కలు తీస్తే కేంద్రం పరిస్ధితికన్నా రాష్ట్రం పరిస్ధితి బాగానే ఉందన్నారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్దితిపై కావాలనే చంద్రబాబునాయుడు, బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నట్లు సాయిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రాల అప్పుల విషయంలో అసలు కేంద్రం తీరే సరిగా లేదన్నారు. సమర్ధుడైన జగన్ నాయకత్వంలో రాష్ట్రం పరిస్ధితి బాగానే ఉందని చెప్పారు. కేంద్రానికి పన్నుల ఆదాయం పెరిగినా రాష్ట్రాలకు మాత్రం సరిగా ఇవ్వటంలేదంటు ఆరోపించారు. ఈ విషయాలపై కేంద్రం ఆత్మపరిశీలన చేసుకోవాలని విజయసాయిరెడ్డి సూచించటమే ఆశ్చర్యంగా ఉంది.

ఒకవైపు జగన్ మరోవైపు సాయిరెడ్డి డైరెక్టుగానే కేంద్రాన్ని తప్పుపట్టడం, నిలదీయటంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. గడచిన మూడేళ్ళల్లో ఎప్పుడూ జగన్ కానీ మంత్రులు, ఎంపీలు ఎవరు కూడా బహిరంగంగా కేంద్రాన్ని తప్పుపట్టలేదు. అలాంటిది వరుసగా కేంద్రానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారో అర్ధం కావటంలేదు. బహుశా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే జనాలముందు కేంద్రాన్ని బూచిగా చూపించే ప్రయత్నాలు మొదలుపెట్టారా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఎలాగూ రాష్ట్రప్రయోజనాలను కేంద్రం తుంగలో తొక్కేస్తోందన్నవిషయం అందరికీ తెలిసిందే. దాన్నే జగన్ బహిరంగంగా ప్రస్తావిస్తున్నారేమో.