ఈ స‌ర్వేల ప‌ర‌మార్థం ఏంటి? వైసీపీలో ర‌గ‌డ‌

వైసీపీలో స‌ర్వేల‌పై స‌ర్వేలు చేస్తున్నారు. నాయ‌కుల ప‌నితీరును బూత‌ద్దంలో చూస్తున్నారు. ఎవ‌రు ప్ర‌జ‌ల‌తో ఉంటున్నారు? ఎవ‌రు ఉండ‌ట్లేదు..? అనే అంశాల‌ను నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్నారు. దీంతో నాయ‌కులు ఎక్క‌డిక‌క్క‌డ హ‌డ‌లి పోతున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. చివ‌ర‌కు ఏం జ‌రుగుతుంద‌నేది.. ఎవ‌రికి అర్ధం కావ‌డం లేదు. “ఇన్ని స‌ర్వేలు చేయిస్తున్నారు. మాకు టికెట్ ఇస్తామ‌నో.. ఇవ్వ‌మ‌నో తేల్చేస్తే. మా దారి మేం చూసుకుంటాం” అని ఒక నాయ‌కుడు వ్యాఖ్యానించే వ‌ర‌కు వ‌చ్చిందంటే.. దాని అర్ధం ఏంటి? అంటే.. పార్టీపై న‌మ్మ‌కం స‌న్న‌గిల్లుతోందా? లేక అధినేతపై విశ్వాసం పోతోందా? అనేది చ‌ర్చ‌గా మారింది.

గడప గడపకు ప్రభుత్వం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటి తలుపు తట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. కానీ.. చాలామంది ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. దీంతో.. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన సర్వేలతో.. జగన్ వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఆ తర్వాత వారం క్రితం మరో వర్క్‌ షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా.. 15 మంది ఎమ్మెల్యేలు మినహా గడప గడపకు కార్యక్రమాన్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదన్నారు. 50 మంది ఎమ్మెల్యేలు అసలు కార్యక్రమాన్నే ప్రారంభించలేదని, మిగతా ఎమ్మెల్యేలు అప్పుడప్పుడూ వెళ్లి వస్తున్నారని ప్రకటించారు.

అంతేకాదు.. తన దగ్గర రెండు సర్వేలు ఉన్నాయని, ఎవరి పర్‌ఫామెన్స్‌ ఏంటో ఈ నివేదికల్లో ఉందని హెచ్చ‌రించారు. ఈ ప‌రిణామాల త‌ర్వాత‌.. నాయ‌కుల్లో గుబులు మ‌రింత పెరిగింది. ముఖ్యమంత్రి జగన్‌ దగ్గర ఉన్న ఒక సర్వే ఐప్యాక్‌ బృందం ఇచ్చింది కాగా.. మరొకటి క్రాస్‌ చెక్‌ చేసుకునేందుకు మరో సర్వే ఏజెన్సీకి అప్పగించారని నాయ‌కులు భావిస్తున్నారు. ఆ ఏజెన్సీ కూడా ఐప్యాక్ ఇచ్చిన రిపోర్ట్ మాదిరిగానే ఉంద‌ని తేలిపోయింది. పైగా ఈ రెండు సర్వేలతో పాటు నిఘా వర్గాల నుంచి మరో సర్వేను కూడా తెప్పించుకొని సరిచూసుకున్నారని నాయ‌కులు భావిస్తున్నారు.

రోజురోజుకు గ్రాఫ్‌ పడిపోవడంతోపాటు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని ఈ మూడు సర్వేలు తేల్చాయి. నగరాల నుంచి గ్రామాల వరకూ తీవ్ర వ్యతిరేకత ఉందని తేల్చాయి. వైసీపీకి చెందిన గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నాయకత్వం యాక్టివ్‌గా లేదని.. కొంత మంది నాయ‌కులు అసలు పార్టీ వైపు కన్నెత్తి చూడటం లేదని సర్వేలు స్పష్టం చేసిన‌ట్టు నాయ‌కుల‌కు ఉప్పందింది. దీంతో నాయ‌కులు ఇప్పుడు బెంబేలెత్తుతున్నారు. ఏం చేయాలి? ఎలా సాగాలి? ఇంత చేసినా.. అధినేత క‌నిక‌రంచూపుతారా? అస‌లు ఈ స‌ర్వేల గోలేంటి? ఇంకా రెండేళ్ల స‌మ‌యం ఉండ‌గా.. ప‌నిచేసుకునే అవ‌కాశం ఉండ‌గా.. ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం.. ఎందుకు? అని నాయ‌కులు మ‌థ‌న‌ప‌డుతున్నారట‌. ఇదీ.. ఇప్పుడు వైసీపీలో జ‌రుగుతున్న హాట్ టాపిక్.