తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరో విడత వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఆయనకు వరద ప్రభావిత ప్రాంతాల్లో కనీవినీ ఎరుగని స్వాగతం లభించింది. జయహో చంద్రన్నా.. అంటూ..యువత నుంచి వృద్ధుల వరకు ఆయనను చూసేందుకు తరలి వచ్చారు. అడుగడుగునా.. ఆయనకు ఘన స్వాగతం పలికారు. పూల మాలలు, గజ మాలలతో ఆయనకు ఎదురొచ్చి.. కాన్వాయ్ ముందే.. ఆయనకు మాలలు ధరించేందుకు పోటీ పడ్డారు.
రెండు మూడు సందర్భాల్లో అభిమానులను అదుపు చేయడం.. సెక్యూరిటీకి కూడా వల్లకాలేదు. దీంతో చంద్రబాబుకారు డోర్ తెరిచి బయటకు వచ్చి.. అభిమానులకు అభివాదం చేశారు. వారిని పలకరించారు. పలువురు ఆయనతో కరచాలనానికి పోటీ పడ్డారు. మరికొందరు పట్టు శాలువాలు అందించారు. దీంతో చంద్రబాబు పర్యటన ఆద్యంతం.. పార్టీ నేతలు.. అభిమానులు.. తమ్ముళ్ల కోలాహలంతో రసరమ్యంగా సాగింది.
విలీన మండలాల్లో చంద్రబాబు ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు. పోయిన వారం రెండు రోజుల పాటు ఆయన ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించి బాధితులను కలిశారు. అప్పుడే విలీన మండలాలకు కూడా వెళ్లాలని భావించినా అప్పటికి ఆ ప్రాంతంలో వరద ఉధృతి తగ్గకపోవడంతో ఆ పర్యటన వాయిదా పడింది.
గురువారం ఉదయం ఆయన విజయవాడ నుంచి బయలుదేరి కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పర్యటిస్తున్నారు. ఆ రాత్రి ఆయన భద్రాచలంలో బస చేస్తారు. శుక్రవారం ఉదయం రామాలయాన్ని సందర్శించి పూజలు చేస్తారు. అదేరోజు ఎటపాక, కూనవరం, వర రామచంద్రాపురం మండలాల్లో బాధితులను పరామర్శిస్తారు.
ఇదిలావుంటే, వరద బాధితులను ఆదుకొనేందుకు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరి తెలిపారు. బాధిత ప్రాంతాల్లో ఆహారం, తాగునీరు, మందులు సహా ఇతర వస్తువుల పంపిణీ ప్రారంభించామని చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్టు సిబ్బంది సహకారంతో జరుగుతున్న ఈ సేవా కార్యక్రమాలను ఆమె సమీక్షించారు.
గోదావరి జిల్లాలు సహా రాష్ట్రవ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 8వేల కుటుంబాలకు నిత్యావసరాలు, మందులు, పాలు అందించామని, అదే స్ఫూర్తితో మిగిలిన వారికి సాయం అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates