కేటీఆర్ బ‌ర్త్‌డే ఎఫెక్ట్.. ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు

తెలంగాణ‌లో కేసీఆర్ స‌ర్కారు పాల‌న‌పై విప‌క్షాలు కొన్ని విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసింది. ఇది గ‌డీ ల పాల‌న అంటూ.. వ్యాఖ్యానిస్తున్నాయి. రాచ‌రికం న‌డుస్తోంద‌ని దుయ్య‌బ‌డుతున్నాయి. నిజాం పాల‌న‌ను మ‌రిపిస్తున్నారంటూ.. కేసీఆర్ కుటుంబంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీనికి త‌గిన‌ట్టుగానే ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో ఓ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ నెల 24న‌ మునిసిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్‌.. పుట్టిన రోజు.

అయితే.. ఆ రోజు.. మంచిర్యాల మునిసిపాలిటీలో అధికారులు పెద్ద ఎత్తున కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. అంద‌రూ రావాల‌ని హుకుం జారీ చేశారు. అయితే.. ఈ కార్య‌క్ర‌మానికి కొంద‌రు ఉద్యోగులు డుమ్మా కొట్టారు. దీనిని సీనియ‌ర్ గా తీసుకున్న అధికారులు వారికి షో కాజ్‌.. నోటీసులు జారీచేశారు. ప్ర‌స్తుతం ఇది.. తీవ్ర‌స్థాయి వివాదంగా మారింది. దీనిపై విప‌క్షాలు తీవ్ర‌స్థాయిలో ఫైర్ అవుతున్నాయి. గ‌డీల పాల‌న‌లో ఇంత‌క‌న్నా ఏంజ‌రుగుతుంద‌ని.. నాయ‌కులు దుమ్మెత్తి పోస్తున్నారు.

ఏం జ‌రిగింది?

ఈ నెల 24న కేటీఆర్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని మంచిర్యాల జిల్లాలోని బెల్లంప‌ల్లి మునిసిపాలిటిలో అధికారులు పెద్ద ఎత్తున కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. కేక్ క‌ట్ చేసి.. ట‌పాసులు పేల్చి.. సంబ‌రాలు చేసుకున్నారు. అయితే.. ఈ కార్య‌క్ర‌మానికి ఓ న‌లుగురు ఉద్యోగులు గైర్హాజ‌ర‌య్యారు. దీంతో వారు ఎందుకు రాలేదంటూ.. ఉన్న‌తాధికారులు ప్ర‌శ్నించారు. అంతేకాదు.. వారికి కార‌ణం చెప్పాలంటూ.. షో కాజ్ నోటీసులు కూడా జారీ చేశారు.

మునిసిప‌ల్ ఉద్యోగులు పున్నం చంద‌ర్‌, రాజేశ్వ‌రి, మోహ‌న్, శ్రావ‌ణ్‌ల‌కు ఉన్న‌తాధికారులు ఈ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే.. ఇది దుమారానికి దారి తీయ‌డంతో.. స్పందించిన బెల్లంప‌ల్లి మునిసి ప‌ల్ క‌మిష‌న‌ర్‌.. త‌మ శాఖ ఉన్న‌తాధికారుల ఆదేశాల మేర‌కే ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించినట్టు తెలిపారు. అదేవిధంగా ఉద్యోగుల‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వ‌డం వెనుక కూడా.. ఉన్న‌తాధికారుల ఆదేశాలే ఉన్నాయ‌న్నారు. దీంతో ఇదంతా.. కేటీఆర్ ఆదేశాల మేర‌కు జ‌రిగిన‌దేన‌ని.. ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. మ‌రి ఈ వివాదం ఎటు మ‌లుపు తిరుగుతుందో చూడాలి.