మంత్రయితే ఏమైనా చేయొచ్చా

లిప్త‌కాలం పాటు.. తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం కోసం సామాన్యుడు అల్లాడిపోతున్న విష‌యం తెలిసిందే. రెప్ప‌పాటు కాల‌మైనా.. వైకుంఠధాముని ద‌ర్శ‌నం దొరికితే చాల‌ని త‌పించిపోతాడు. అయితే.. త‌మ‌కున్న ప్రొటోకాల్ ను అడ్డు పెట్టుకుని.. మంత్రులు.. ఇక్క‌డ రెచ్చిపోతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. వారానికి రెండు సార్లు.. విధిగా ద‌ర్శించుకునే మంత్రులు పెరిగిపోతున్నారు. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.

తాజాగా మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు.. తిరుమ‌ల‌లో హ‌ల్చ‌ల్ చేశారు. త‌న వెంట 150 మందిని తీసుకువ‌చ్చిన ఆయ‌న‌.. అంద‌రికీ .. ప్రొటోకాల్ దర్శనం కల్పించాలని అధికారుల‌పై ఒత్తిడి చేశారు. దీంతో ఆయ‌న ఒత్తిడిని భ‌రించ‌లేని అధికారులు.. సామాన్య భ‌క్తుల‌ను గంట‌ల త‌ర‌బ‌డి.. క్యూలైన్ల‌లో కూర్చోబెట్టి.. మంత్రిగారికి రెడ్ కార్పెట్ ప‌రిచారు. ప్ర‌స్తుతం ఇది తీవ్ర వివాదంగా మారింది.

ఏం జ‌రిగింది?

ఏపీ ప‌శుసంవ‌ర్థ‌క శాఖ మంత్రి అప్పలరాజు తిరుమలకు వచ్చారు. మంత్రి వెంట అనుచరులు భారీగా తరలివచ్చారు. అయితే తన అనుచరులందరికి ప్రొటోకాల్ దర్శనం కల్పించాలని అధికారుల‌పై మంత్రి అప్పలరాజు ఒత్తిడి చేశారు. మంత్రి ఒత్తిడికి తలొగ్గిన అధికారులు… అనుచరుల్లో 20 మందికి ప్రొటోకాల్‌ దర్శనం కల్పించారు. మరో వందమందికి బ్రేక్‌ దర్శనం కల్పించారు. దీంతో టీటీడీ తీరుపై సామాన్య భక్తులు మండిపడుతున్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అప్పలరాజు ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చారు. తన నియోజకవర్గ ప్రజలు 150 మందితో శ్రీవారి దర్శనానికి వచ్చానని… సామాన్య భక్తుడి మాదిరిగా క్యూలైన్‌లో వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నానని తెలిపారు. శ్రీవారిని దర్శించుకోవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నామన్నారు. తిరుమలలో ఎక్కడా అధికార హోదా ప్రదర్శించలేదని చెప్పారు. అయితే.. ప్ర‌తిప‌క్షాలు మాత్రం మంత్రి దూకుడును ఖండిస్తున్నాయి. అధికారం ఉంద‌ని ఇలా చేస్తారా? అని మండిప‌డుతున్నాయి.