మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లే అనిపిస్తోంది. నల్గొండ జిల్లాలోని మునుగోడు ఎంఎల్ఏ రాజగోపాలరెడ్డి అనేకమంది సీనియర్ నేతల్లో ఒకరు. కాకపోతే ఆర్ధిక, అంగబలమున్న నేత. నియోజకవర్గంలో గట్టి పట్టున్న నేతగానే చెప్పాలి. అలాంటి నేత పార్టీకి రాజీనామా చేసి తొందరలోనే బీజేపీలో చేరాలని అనుకున్నారు. ఈ మాత్రం దానికే పార్టీ అధిష్టానం నుండి పీసీసీ అధ్యక్షుడు వరకు ఎందుకింత హైరానా పడుతున్నారో అర్ధం కావటం లేదు.
ఎలాగైనా రాజగోపాల్ ను కాంగ్రెస్ లోనే కంటిన్యూ అయ్యేట్లు చూసేందుకు అధిష్టానం నుండి ప్రత్యేక దూత వచ్చారు. ఈయన సరిపోదన్నట్లుగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లాంటి మరికొందరు నేతలు రాజగోపాలరెడ్డి ఇంటికి క్యూ కట్టారు. పార్టీ మారద్దని బతిమలాడుకుంటున్నారు. జరుగుతున్నది చూస్తుంటే పార్టీయే రాజగోపాలరెడ్డిని బీజేపీలో హీరోని చేసేట్లుంది. కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరబోతున్నట్లు గతంలో కూడా ఎంఎల్ఏ చాలాసార్లే ప్రకటించారు. అయినా పార్టీలోనే కంటిన్యూ అవుతున్నారెందుకు ?
ఎందుకంటే బీజేపీలో బేరాలు వర్కవుట్ కావటం లేదేమో అనిపిస్తోంది. ఇపుడు కూడా మండలస్ధాయిలోని తన మద్దతుదారులతో సమావేశాలు పెడితే చాలామంది కాంగ్రెస్ లోనే ఉంటామని తెగేసి చెప్పారట. ఒకవేళ ఎంఎల్ఏ బీజేపీలోకి పోతే ఏమవుతుంది ? మహా అయితే ఒకసీటు పోతుందంతే. జనాలు కాంగ్రెస్ కు ఓట్లేయాలని అనుకుంటే రేపటి జనరల్ ఎన్నికల్లో రాజగోపాల్ కూడా ఓడిపోవచ్చు.
ఇక్కడ సమస్య ఏమిటంటే గతంలో ఎంతోమంది పార్టీని వదిలేశారు. అప్పట్లో లేని ఓవర్ యాక్షన్ ఇప్పుడే ఎందుకు జరుగుతోందో అర్ధం కావటంలేదు. రాజగోపాల్ అసలు సమస్య రేవంత్ కు పీసీసీ బాధ్యతలు ఇవ్వటమే. పీసీసీ అద్యక్షుడిగా రేవంత్ కాకుండా తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇచ్చుంటే ఇపుడు రాజగోపాల్ బీజేపీలోకి వెళ్ళేవారేనా ? మొత్తం మీద పార్టీయే ఒక ఎంఎల్ఏని హీరోని చేస్తోందని అనిపిస్తోంది.